
రోజు మొత్తం హెచ్చుతగ్గుల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు క్షీణించి 34,842 వద్ద నిలవగా.. నిఫ్టీ 16 పాయింట్ల వెనకడుగుతో 10,289 వద్ద స్థిరపడింది. రెండో దశ కోవిడ్-19 కేసుల ఆందోళనలతో బుధవారం అమెరికా మార్కెట్లు పతనంకాగా.. దేశీయంగానూ ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ తొలుత 34,500 వద్ద కనిష్టాన్ని తాకగా.. తదుపరి 35,082 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇదే విధంగా నిఫ్టీ 10,362- 10,195 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో 5 శాతం క్షీణత చవిచూడనున్నట్లు ఐఎంఎఫ్ తాజాగా వేసిన అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడంతో మార్కెట్లు ఒడిదొడులను ఎదుర్కొన్నట్లు తెలియజేశారు.
ఎఫ్‌ఎంసీజీ అప్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ 2 శాతం పుంజుకోగా.. ఫార్మా 0.8 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఐటీ, రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ 1.2-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఐవోసీ, ఐషర్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ 3-2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐటీసీ 6 శాతం జంప్‌చేయగా.. హీరో మోటో, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, గెయిల్, వేదాంతా, హెచ్‌యూఎల్, సిప్లా, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ 3-0.6 శాతం మధ్య లాభపడ్డాయి.
ఐబీ హౌసింగ్ జోరు
డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్, బెర్జర్ పెయింట్స్, ఎన్‌ఎండీసీ, హెచ్‌పీసీఎల్, అమరరాజా, పేజ్ ఇండస్ట్రీస్ 4-2 శాతం మధ్య పతనంకాగా.. ఐబీ హౌసింగ్, పిరమల్, ఉజ్జీవన్, నాల్కో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, మ్యాక్స్ ఫైనాన్స్, మణప్పురం, చోళమండలం, సన్ టీవీ 9.2- 4.6 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1534 లాభపడగా.. 1166 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐలు భేష్
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1767 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1525 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 169 కోట్లు, డీఐఐలు రూ. 454 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment