
కోవిడ్-19ను నిలువరించే వ్యాక్సిన్ తొలి దశ పరీక్షలు అమెరికాలో విజయవంతమైన వార్తలతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. సోమవారం అమెరికా ఇండెక్సులు 4 శాతంవరకూ లాభపడగా.. తొలుత సెన్సెక్స్ 700 పాయింట్లవరకూ జంప్‌చేసింది. 30,740 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఆపై మిడ్‌సెషన్ నుంచీ స్పీడ్ తగ్గుతూ వచ్చింది. చివరికి 167 పాయింట్లు మిగిల్చుకుని 30,196 వద్ద ముగిసింది. వెరసి ఇంట్రాడేలో నమోదైన 30,117 పాయింట్ల కనిష్టానికి చేరువలో నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 56 పాయింట్లు లాభపడి 8,879 వద్ద స్థిరపడింది. అయితే అంతకుముందు 9030 వద్ద గరిష్టాన్నీ, 8855 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. మోడర్నా ఇంక్ రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి దశ పరీక్షలు ఫలవంతమైనట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
మీడియా జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ఆటో, మెటల్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 2-0.75 శాతం మధ్య ఎగశాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్ 2.6 శాతం క్షీణించాయి. రియల్టీ సైతం 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్ 11 శాతం దూసుకెళ్లగా.. అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్‌ఫ్రాటెల్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ 9-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే సస్యరక్షణకు వినియోగించే కొన్ని ఇన్‌సెక్టిసైడ్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించనున్న వార్తలతో యూపీఎల్ 10 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో వేదాంతా, ఆర్‌ఐఎల్, ఇండస్‌ఇండ్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, సిప్లా, యాక్సిస్, నెస్లే 2.7-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఐడియా స్పీడ్
డెరివేటివ్స్‌లో ఐడియా 20 శాతం పురోగమించగా.. అదానీ పవర్, పీవీఆర్, ఎల్‌ఐసీ హౌసింగ్, అమరరాజా, జిందాల్ స్టీల్, మైండ్‌ట్రీ 16-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క బీవోబీ, బంధన్ బ్యాంక్, మణప్పురం, బీఈఎల్, ఆర్‌ఈసీ, ఫెడరల్ బ్యాంక్, ఎస్‌ఆర్‌ఎఫ్, పీఎన్‌బీ, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.5-3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ 0.5 శాతం బలపడగా.. స్మాల్ క్యాప్ 0.2 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1030 లాభపడగా.. 1262 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం రూ. 2513 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) సైతం రూ. 152 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.