మారుతీకి డీమోనిటైజేషన్ దెబ్బ
• నవంబర్‌లో తగ్గిన డిమాండ్
• 20 శాతం క్షీణించిన బుకింగ్స్
• డిసెంబర్‌లో కొంత మెరుగు
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం గణనీయంగానే పడింది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే వ్యవధిలో బుకింగ్స్ 20 శాతం మేర క్షీణించాయి. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా నగదు కొరత నెలకొనడంతో డిమాండ్ పడిపోవడమే ఇందుకు కారణమని సంస్థ పేర్కొంది. అయితే, ఈ నెలలో మాత్రం పరిస్థితులు కాస్త మెరుగయ్యాయని.. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈసారి బుకింగ్‌లు 7 శాతం మేర పెరిగాయని వివరించింది. ’మా గణాంకాల ప్రకారం డీమోనిటైజేషన్ ప్రభావంతో నవంబర్‌లో నిజంగానే బుకింగ్స్ తగ్గాయి. ట్రూ వేల్యూ అమ్మకాలూ పడిపోయాయి.
గతేడాది అక్టోబర్–నవంబర్ వ్యవధిలో ఈ రిటైల్ అమ్మకాలు కనీసం 6–7 శాతం అధికంగానే నమోదయ్యాయి. ఇక గతేడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో బుకింగ్స్ సుమారు 20 శాతం మేర తగ్గాయి’ అని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్ సీ భార్గవ తెలిపారు. డీమోనిటైజేషన్ జరిగిన వెంటనే ఎంతో కొంత అనిశ్చితి, ప్రజల్లో కొంత ఆందోళన నెలకొనడం ఇందుకు కారణం కావొచ్చన్నారు. మారుతీ ట్రూ వేల్యూ అవుట్‌లెట్స్‌లో అమ్మకాలు క్షీణించడాన్ని ప్రస్తావిస్తూ.. యూజ్డ్ కార్లపై అధిక వడ్డీ రేట్లతో పాటు నగదు కొరత ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. అయితే, ఈ ట్రెండ్ క్రమంగా మారుతున్నప్పటికీ.. అమ్మకాల వృద్ధి ఇంకా నెగటివ్ స్థాయిలోనే ఉందని వివరించారు.
కనీసం 10 శాతం వృద్ధి..
ప్రస్తు్తత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఏడాది నవంబర్ దాకా అమ్మకాల వృద్ధి రెండంకెల స్థాయిలోనే కొనసాగిందని భార్గవ చెప్పారు. అయితే, తాజా పరిణామాల దరిమిలా 10 శాతం దరిదాపుల్లోనే వృద్ధి ఉండగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉత్పత్తి, నిల్వల స్థాయులను యథాతథంగానే కొనసాగిస్తున్నామని భార్గవ తెలిపారు. . కొత్త కార్లకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇగ్నిస్, బాలెనో ఆర్‌ఎస్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు భార్గవ చెప్పారు.
రూ. 3,800 కోట్లతో రోహ్‌తక్‌లో పరిశోధన కేంద్రం ..
రోహ్‌తక్‌లో ఏర్పాటు చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కేంద్రంపై 2019 మార్చి నాటికల్లా దాదాపు రూ. 3,800 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు మారుతీ సుజుకీ ఈడీ (ఆర్‌అండ్‌డీ విభాగం) సీవీ రామన్ తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ రూ. 1,700కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ ప్లాంటు .. మరింత వేగంగా కార్ల డిజైనింగ్, అభివృద్ధి, ఆవిష్కరణకు ఉపయోగపడనుంది.