
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘బాలెనో’ కారు నూతన వేరియంట్లను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన పెట్రోల్ ఇంజిన్ కారు ధరల శ్రేణి రూ.5.58 లక్షల నుంచి రూ.8.9 లక్షలుగా ప్రకటించింది. వీటితో పాటు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మరో రెండు అధునాతన వేరియంట్లను కంపెనీ విడుదలచేసింది. 1.2 లీటర్ల డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ ధర రూ.7.25 లక్షలు కాగా, జీటా వేరియంట్ ధర రూ.7.86 లక్షలు. ఈ కార్లు లీటరుకు 23.87 కిలో మీటర్ల మైలేజీ ఇస్తాయని సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంఎస్‌ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్.కల్సి మాట్లాడుతూ.. ‘అధునాతన, మెరుగైన, పర్యావరణ స్నేహపూర్వక సాంకేతికత కలిగిన ఉత్పత్తులను అందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలకు తగిన, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ బాలెనోను విడుదలచేశాం. దేశంలోనే తొలి ఈ తరహా టెక్నాలజీ కలిగిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఇది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా ఉందని భావిస్తున్నాం’ అని అన్నారు. ఇక బాలెనో మోడల్ 2015లో విడుదల కాగా, ఇప్పటివరకు 5.5 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే 2 లక్షల యూనిట్లను విక్రయించింది.
అగ్రస్థానంలో ‘ఆల్టో’
ఇప్పటికే అనేక సార్లు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన మారుతీ ‘ఆల్టో’.. 2018–19 ఏడాది ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల జాబితాలో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం.. గతేడాదిలో ఆల్టో వాహన విక్రయాలు 2,59,401 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది (2017–18) అమ్మకాలు 2,58,539 యూనిట్లు. ఇక టాప్ 10 విక్రయాల జాబితాలో 2,53,859 యూనిట్లతో డిజైర్ రెండో స్థానంలో నిలిచింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ 2,23,924 యూనిట్లతో మూడవ స్థానంలో ఉండగా.. బాలెనో 2,12,330 యూనిట్లతో 4వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment