
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ త్వరలో భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను (ఈవీ) ప్రవేశపెట్టే దిశగా కసరత్తు మొదలెట్టింది. దీనికోసం టొయోటాతో చేతులు కలిపింది. 2020 నాటికల్లా భారత్‌లో ఈవీలను ప్రవేశపెట్టడంలో పరస్పరం సహకరించుకునేందుకు రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
దీని ప్రకారం భారత మార్కెట్ కోసం ఈవీలను తయారు చేయనున్న సుజుకీ.. అందులో కొన్నింటిని టొయోటలాకు కూడా సరఫరా చేస్తుంది. ప్రతిగా టొయోటా సాంకేతిక సహకారం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రెండు కంపెనీలు చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈవీల వినియోగాన్ని భారత్‌లో పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం కూడా జరపనున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. చార్జింగ్ స్టేషన్లు, విక్రయానంతర సర్వీసుల కోసం టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వటం మొదలైన కార్యకలాపాలపై దృష్టి సారించనున్నట్లు వివరించాయి.