
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని ఇక నుంచి కస్టమర్లకు బదలాయించక తప్పదని, గడిచిన ఏడాది కాలం నుంచి ధరల భారం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని స్టాక్ ఎక్స్చేంజిలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020 జనవరి నుంచి పెరిగే ధరలు మోడల్ ఆధారంగా ఉండనున్నట్లు వివరించింది. ప్రస్తుతం సంస్థ ఎంట్రీ లెవెల్ స్మాల్ కార్ ఆల్టో నుంచి ప్రీమియం మల్టీ పర్పస్ వాహనం ఎక్స్‌ఎల్6 వరకు విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ. 2.89 లక్షల నుంచి రూ. 11.47 లక్షల వరకు ఉంది.