ముంచిన మారిషస్ పన్ను
♦ తీవ్ర ఒడిదుడుకుల్లో స్టాక్ సూచీలు
♦ 176 పాయింట్ల నష్టంతో 25,597కు సెన్సెక్స్
♦ 39 పాయింట్ల నష్టంతో 7,849కు నిఫ్టీ
మారిషస్ ద్వారా వచ్చే పెట్టుబడులపై మూలధన లాభాల పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం గురువారం స్టాక్ మార్కెట్‌ను తీవ్రమైన ఒడిదుడుకులకు గురి చేసింది. ఈ పన్నుపై కొంత స్పష్టత రావడంతో ఆరంభంలో భారీ నష్టాల పాలైన స్టాక్ సూచీలు కొంత కోలుకున్నాయి. చివరకు నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి నష్టపోయింది. 176 పాయింట్లు క్షీణించి 25,597 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 7,800 మార్క్ దిగువకు పడిపోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 7,849 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, ఏప్రిల్ నెల వినియోదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు(గురువారం) వెల్లడి కానున్న నేపథ్యంలో బ్లూ చిప్ షేర్లలో అప్రమత్త లావాదేవీలు జరిగాయి. వాహన, ఫార్మా, ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు నష్టపోయాయి. 13 రంగాల సూచీల్లో 12 నష్టాల్లోనే ముగిశాయి.