డ్రాగన్.. ఎటాక్!
చైనా మందగమనంపై మళ్లీ రేగిన ఆందోళనలు...
* ఆజ్యం పోసిన మధ్య ఆసియా ఉద్రిక్తతలు
* ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం
* సెన్సెక్స్ 538 పాయింట్లు డౌన్.. 25,623 వద్ద ముగింపు
* నాలుగు నెలల్లో ఇదే పెద్ద పతనం
* 7,800 పాయింట్ల దిగువకు నిఫ్టీ
* 172 పాయింట్ల నష్టంతో 7,791కు చేరిక
కొత్త సంవత్సరం రెండో ట్రేడింగ్ సెషన్‌లోనే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలకు గురైంది. చైనా షాంఘై సూచీ భారీగా పతనం కావడంతో ప్రపంచమార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా కుదేలైంది.
చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తాజాగా ఆందోళనలు చెలరేగడం, మధ్య ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సోమవారం స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 26 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 538 పాయింట్లు(2.16 శాతం) నష్టపోయి 25,623 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 172 పాయింట్లు(2.16 శాతం) నష్టపోయి 7,791 పాయింట్ల వద్ద ముగిశాయి. నాలుగు నెలల కాలంలో ఒక్కరోజులో స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. టెలికం, బ్యాంక్, వాహన, పారిశ్రామిక, ఇంధన, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఫార్మా... అన్ని రంగాల షేర్లలో అమ్మకాటు జరిగాయి.
విస్తరిస్తోన్న చైనా సంక్షోభం...
చైనా సంక్షోభం విస్తరిస్తోందని, ఇది అన్ని వర్ధమాన మార్కెట్లపై ప్రభావం చూపుతుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. సెలవుల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెంచుతారనే అంచనాలున్నాయని, ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్‌కు ఇది మంచి ప్రారంభం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
స్టాక్ మార్కెట్ సం‘గతి’...
* టాటా మోటార్స్‌కు లాభాలు అధికంగా వచ్చే జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాల్లో అధిక భాగం చైనా నుంచే వస్తున్నాయి. అలాంటి చైనా మందగమనంలో ఉందన్న ఆందోళనతో టాటా మోటార్స్ షేర్ల లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ స్టాక్
6 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే.
* కాల్‌డ్రాప్ నిబంధనలను ఈ నెల 1 నుంచే పాటించాలని టెలికం కంపెనీలకు ట్రాయ్ లేఖలు రాయడంతో టెలికం షేర్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా 4-5 % రేంజ్‌లో పడ్డాయి. ఆర్‌కామ్ 9% నష్టపోయింది.
* లోహాలను అధికంగా వినియోగించే చైనాపై ఆందోళన కారణంగా హిందాల్కో,టాటా స్టీల్, వేదాంత వంటి లోహ షేర్లు 1-4% రేంజ్‌లో నష్టపోయాయి.
* ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, భెల్ వంటి సెన్సెక్స్ షేర్లతో పాటు కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తదితర షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.
* 30 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విప్రో, హిందూస్తాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్ స్వల్పంగా (0.2 శాతం రేంజ్‌లో) లాభపడ్డాయి.
* అదానీ పోర్ట్స్ 3.6 శాతం, భెల్ 3.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.2 శాతం, ఎస్‌బీఐ 2.9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.8 శాతం, లుపిన్ 2.5 శాతం, ఎల్ అండ్ టీ 2.5%, గెయిల్ 2.4 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.3%, సన్ ఫార్మా 2.1 శాతం, ఇన్ఫోసిస్ 2 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.9 శాతం చొప్పున నష్టపోయాయి.
* 1,,599 షేర్లు నష్టాల్లోకి జారుకోగా... 1,289 షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఎందుకు పడిపోయిందంటే...
* చైనా ఫ్యాక్టరీ ఉత్పత్తి వరుసగా పదో నెలలో కూడా తగ్గిపోయిందని ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించడంతో దీర్ఘకాల సెలవుల అనంతరం ప్రారంభమైన ఆసియా మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. నవంబర్‌లో 48.6గా ఉన్న కైక్సిన్ తయారీరంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) డిసెంబర్‌లో 48.2కు పడిపోయింది. దీంతో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా మందగమనంపై తాజాగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ భయాలతో చైనా షాంఘై సూచీ 6.8 శాతం పడిపోవడంతో ట్రేడింగ్‌ను ఆపేశారు. ఈ ప్రభావంతో ఆసియా, యూరప్, అమెరికా.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలమయ్యాయి.
* చైనా పీఎంఐయే కాకుండా భారత పీఎంఐ కూడా కొన్ని నెలల కనిష్టానికి పడిపోవడం ప్రభావం చూపింది. చెన్నైలో డిసెంబర్‌లో భారీగా వరదలు రావడం దేశీయ తయారీరంగంపై ప్రభావం చూపింది. నవంబర్‌లో 50.3గా ఉన్న నికాయ్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డిసెంబర్‌లో 49.1కు పడిపోయింది.
* షియా మత పెద్ద షేక్ నిమ్ ్రఅల్ నిమ్‌న్రు సౌదీ అరేబియా ఉరితీసింది. దీంతో షియాలు అధికంగా ఉంటే ఇరాన్‌లో సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంపై దాడులు జరిగాయి. దీంతో ఇరాన్‌తో దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ మధ్య ఆసియా భౌగోళిక ఉద్రిక్తత కూడా మన స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
* దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో విదేశీ నిధులు తరలిపోతాయనే ఆందోళనలూ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి.
లక్షన్నర కోట్ల సంపద ఆవిరి
అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.54 లక్షల కోట్లు అవిరైంది. దీంతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వంద లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. శుక్రవారం నాడు రూ.100.93 లక్షల కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద సోమవారం రూ.99,39,378 లక్షల కోట్లకు క్షీణించింది.
ప్రపంచ మార్కెట్లు... బేర్!
కొత్త ఏడాదికి ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాలతో స్వాగతం పలికాయి. ఈ నెల 1 శుక్రవారం నాడు భారత్ మార్కెట్ పనిచేసినప్పటికీ, చాలా దేశాల మార్కెట్లకు సెలవు. నూతన సంవత్సరంలో తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. చైనా తయారీ రంగ పీఎంఐ డిసెంబర్‌లో 50 పాయింట్ల దిగువకు పడిపోవడంతో చైనా షాంఘై సూచీ ఇంట్రాడేలో 7 శాతానికి పైగా పడిపోయింది. మరో చైనా స్టాక్ సూచీ షెన్‌జెన్ కాంపొజిట్ 8 శాతానికి పైగా నష్టపోయింది.సూచీలు 7 శాతానికి పైగా క్షీణిస్తే ఆరోజుకు ట్రేడింగ్‌కు నిలిపేయాలన్న కొత్త సర్క్యూట్ బ్రేకర్ నిబంధనల కారణంగా ట్రేడింగ్ నిలిపేశారు.
ఇతర ఆసియా మార్కెట్లు భారీగానే నష్టపోయాయి. జపాన్ నికాయ్ 583 పాయింట్లు(3.1 శాతం), హాంగ్ సెంగ్ 2.7 శాతం చొప్పున నష్టపోయాయి. దక్షిణ కొరియా, సింగపూర్ సూచీలు 2 శాతం వరకూ పతనమయ్యాయి. ఇక యూరప్ మార్కెట్ల విషయానికొస్తే జర్మనీ డ్యాక్స్ 460 పాయింట్లు (4.3 శాతం), ఫ్రాన్స్ సీఏసీ 40 సూచీ 115 పాయింట్లు (2.5 శాతం), లండన్ ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ 149 పాయింట్లు (2.4 శాతం) చొప్పున పతనమయ్యాయి.
యూరోప్ దేశాల వస్తువులను అధికంగా చైనాయే కొనుగోలు చేస్తుందని, అందుకని యూరప్ మార్కెట్లు అధికంగా నష్టపోయాయని విశ్లేషకులంటున్నారు. ఇక అమెరికా మార్కెట్ల విషయానికొస్తే, కడపటి సమాచారం అందేసరికి నాస్‌డాక్ 139 పాయింట్లు(2.8 శాతం), డోజోన్స్ 423 పాయింట్లు (2.4 శాతం) నష్టాలతో ట్రేడవుతున్నాయి.
కనకం కళకళ..
స్టాక్ మార్కెట్ పతనంతో రూపాయి క్షీణించగా, పుత్తడి మాత్రం వెలుగులు విరజిమ్మింది. స్టాక్స్, రూపాయి పతనం వల్ల, సురక్షిత మదుపు సాధనంగా బంగారమే సరైనదన్న భావనతో దేశీయంగా, అంతర్జాతీయంగా కనకం ధరలు కళకళలాడాయి. సింగపూర్‌లో ఔన్స్ బంగారం 0.9 శాతం లాభంతో 1,070డాలర్లకు, అలాగే లండన్‌లో 1.17 శాతం వృద్ధితో 1,073.4 డాలర్లకు పెరిగాయి.
న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.195 పెరిగి రూ.25,615కు ఎగసింది. ఇక ముంబైలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం రూ.295 పెరిగి రూ.25,460కు చేరగా, చెన్నైలో రూ.310 పెరిగి రూ.25,690కు పెరిగింది.