9,900 దాటేసిన నిఫ్టీ
స్వల్ప లాభాలతో నూతన గరిష్ట స్థాయిలకు సూచీలు
ముంబై: మార్కెట్లు సోమవారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరాయి. గత కొన్ని రోజులుగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న మద్దతు కొసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద క్లోజయ్యాయి. బ్లూచిప్ కంపెనీల నుంచి మెరుగైన ఆర్థిక ఫలితాలు వస్తాయన్న అంచనాలతో కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఇప్పటి వరకు వర్షపాతం సాధారణం కంటే పైనే ఉండడం కూడా సానుకూల వాతావరణానికి దారితీసింది. అటు చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలకు మించి ఉండొచ్చన్న సంకేతాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు నిరాశపరచడంతో యూఎస్ ఫెడ్ తన విధానాన్ని కఠినం చేస్తుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాలు ఆర్జించాయి.
సెన్సెక్స్ 32,131.92 జీవిత కాల గరిష్ట స్థాయి నమోదు చేసింది చివరికి 54 పాయింట్ల లాభంతో 32,074 వద్ల క్లోజ యింది. నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 9,915.95 వద్ద ముగి సింది. సూచీల్లోని స్టాక్స్ లో విప్రో అత్యధికంగా 3 శాతం లాభపడింది. ఇన్ఫోసిస్ 1.37% పెరిగింది. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, హెచ్‌యూఎల్, రిలయన్స్ సైతం లాభపడ్డాయి. జూన్ త్రైమాసికంలో 25 శాతం అధికంగా లాభాలను నమోదు చేసిన జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేరు 9.31 శాతం లాభపడడం గమనార్హం. ‘‘పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం, బ్యాంకింగ్ రంగంపై ఎటువంటి అంచనాలు లేకపోవడంతో నిఫ్టీ 10,000 మార్కుకు దూరంలో నిలిచింది. ఫలితాల సీజన్ కావడంతో స్టాక్స్ వారీ కొనుగోళ్లకు ఉత్సాహం కనిపించింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్‌జేమ్స్ అన్నారు.
5 లక్షల కోట్లకు ఆర్‌ఐఎల్ విలువ
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా 5 లక్షల కోట్ల మార్కును దాటిం ది. దీంతో దేశంలో విలువ పరంగా నంబర్ 1 స్థానానికి చేరింది. సోమవారం ఆర్‌ఐఎల్ స్టాక్ 1.33 శాతం లాభపడి బీఎస్‌ఈలో రూ.1,551.35 వద్ద క్లోజయింది. దీంతో సోమవారం ఒక్కరోజే రూ.6,672 కోట్ల మేర విలువ పెరిగి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,04,458 కోట్లకు చేరింది. ఈ ఏడాదిలో ఆర్‌ఐఎల్ స్టాక్ ఇప్పటి వరకు 43 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఆర్‌ఐఎల్ తర్వాత టీసీఎస్ రూ.4,58,605.88 కోట్ల విలువతో రెండో స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.4,33,133 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.