
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆర్థిక బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ప్రయివేటు రంగానికి వత్తాసు తప్ప సామాన్యుడికి ఒరిగేదీ లేదని మండిపడ్డారు. ప్రధానంగా ఆర్థిక ద్రవ్యలోటు బాగా నిరాశ పర్చిందన్నారు. 3.5 శాతంగా అంచనా వేసిన ద్రవ్యలోటు 3.2శాతానికి తగ్గడం దురదృష్టకరమన్నారు. 2018-19 బడ్జెట్లో ఆర్థిక ఏకీకరణ పరీక్షలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు.
బడ్జెట్‌లో వ్యవసాయం రంగం కేటాయింపులు, రైతులకు ప్రయోజనాలపై స్పందించిన చిదంబరం వ్యవసాయం రంగంపై ఒత్తిడి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో తక్షణమే రైతులకు లభించే వాస్తవ ఆదాయమేదీ తనకు కనిపించలేదన్నారు. దిగుమతులపై పరిమితి విధించేందుకు అదనపు కస్టమ్ సుంకాన్ని విధించడంపై అభ్యంతరం వ్యక్తంచేసిన చిదంబరం ఎగుమతులను పెంచడానికి ఎలాంటి విధానాలను ప్రకటించదు.. అసలు ప్రభుత్వానికి ఆలోచనే లేదని దుయ్యబట్టారు.
అతి పెద్ద మెడికల్ హెల్త్ కేర్ ఒక పెద్ద బూటకం. ఇది ఒక ఎలక్షన్ ఎత్తుడగ అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం బీమా పథకం. అయితే ప్రీమియం సంగతి ఏంటి.. ఆ లెక్కలెక్కడా తనకు కనిపించలేదని చిదంబరం పేర్కొన్నారు. దీని వలన ప్రయివేటు రంగానికి భారీ ప్రయోజనాలు ఒనగూరనున్నాయన్నారు. అలాగే సగటు పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదని ఆరోపించారు.
కాగా దేశంలోని పది కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. దీని వల్ల ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ ఇవ్వనున్నా మన్నారు. తద్వారా 10కోట్ల కుటుంబాలకు, సుమారు 50 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment