కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్‌లో కేన్సర్ రోగులకు భారీ ఊరట కలిగించారు. కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మూడు మందులను కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ చర్య రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా అవసరమైన మందుల ధరలను గణనీయంగా తగ్గించగలదని భావిస్తున్నారు విశ్లేషకులు. అలాగే స్థానిక తయారీని పెంచడానికి మెడికల్ ఎక్స్-రే మెషీన్‌లలో ఉపయోగించే ఎక్స్-రే ట్యూబ్‌లు, ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్‌ల ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీలో మార్పులు ప్రతిపాదించారు
దీన్ని పారిశ్రామిక పెద్దలు స్వాగతించారు. వాళ్లంతా నిర్మలా సీతారామన్ చర్యను అభినందించారు. దీని కారణంగా రోగ నిర్థారణ సామర్థ్యాలు మెరుగుపడతాయని, దేశీయ వైద్య పరికరాల పరిశ్రమ వృద్ది చెందుతుందని రూబీ హాల్ క్లినిక్ సీఈవో బెహ్రామ్ ఖోడైజీ అన్నారు. అలాగే కస్టమ్స్ డ్యూటీ నుంచి మూడు అదనపు కేన్సర్ చికిత్స ఔషధాలను మినహాయించడం అనేది కేన్సర్ రోగులకు కీలకమైన చికిత్సలను మరింత అందుబాటులోకి ఉండేలా చేస్తుంది. ఈ చర్యలు భారత దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, రోగుల సంరక్షణను మెరుగుపర్చడం కోసం తీసుకున్న వ్యూహంలా ప్రతిబింబిస్తున్నాయని వైద్యుల ఖోడైజీ అన్నారు.
ఇది భారత ప్రభుత్వానికి చాలా అవసరం అని చెప్పారు. ఇక ఈ మినహాయింపులో చేర్చబడిన మందులు ప్రధానంగా వెన్నెముక, కండరాల క్షీణత వంటి అరుదైన, తీవ్రమైన వైద్య పరిస్థితుల్లో చికిత్స చేయడానికి ఉపయోగిస్తారని అన్నారు. ఈ చర్య కారణంగా క్లిష్టమైన చికిత్సలు అవసరమయ్యే రోగులపై వ్యయభారం తగ్గుతుంది. ఇక ఈ బడ్జెట్‌లో వైద్య రంగంలో స్థానిక తయారీ, ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూనే సమాజంలో అన్ని వర్గాలకు తమ స్థోమతలో ఆరోగ్య సంరక్షణ పొందేలా విస్తృత వ్యూహాన్ని పరిగణలోని తీసుకుని మరీ బడ్జెట్‌ని కేటాయించారు సీతారామన్.
ఔషధాలు సాధారణంగా 10% ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ఆకర్షిస్తాయి. అయితే కొన్ని రకాల ప్రాణాలను రక్షించే మందులు, టీకాలు 5% లేదా నిల్ రాయితీ రేటుని ప్రకటించారు. గతేడాది కేన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడే పీడీ1కి సంబంధించిన ఇమ్యునిథెరపీ ఔషధంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం తగ్గించడం జరిగింది. ఇదిలా ఉండగా, గణాంకాల ప్రకారం 2023లో 9.3 లక్షల మంది దాక ప్రాణాంతక కేన్సర్‌తో బాధపడుతున్నట్లు అంచనా. ఆసియాలో అత్యధిక కేన్సర్ మరణాలలో భారత్ రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరూ జీవితంలో ఏదో ఒక సమయంలో కేన్సర్ బారిననపడుతున్నారు. ఇక 2025 నాటికి వార్షిక కేన్సర్ కేసుల సంఖ్య 12.8% పెరుగుతాయని అంచనా.
ఎందుకు మినహాయించారంటే..
గతేడాది పార్లమెంటరీ ప్యానెల్ కేన్సర్ మందులపై జీఎస్టీని మినహాయించాలని, మందుల ధరలను, రేడియేషన్ థెరపీ వ్యయాన్ని నియంత్రించడానికి కఠినమైన చర్యలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. రోగుల సహాయార్థం కేన్సర్‌ని నోటిఫై చేయదగ్గ వ్యాధిగా గుర్తించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. అంతేగాదు ప్యానెల్ సభ్యులు దేశంలో కేన్సర్ చికిత్సకు అవుతున్న అధిక ఖర్చుని హైలైట్ చేయడమే గాక సమగ్ర ధరల నియంత్రణల అవసరాన్ని కూడా నొక్కి చెప్పడంతో ప్రభుత్వం స్పందించి ఇలా వాటిని ప్రాథమిక సుంకంలో మినహాయింపు ఇచ్చింది.
ఎలా పొందుతారంటే..
కేంద్ర లేదా రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ లేదా జిల్లా వైద్యాధికారి/సివిల్ సర్జన్ నుంచి రోగులు ధృవీకరణ పత్రాన్ని అందుకుంటే వారికి ఈ మినహాయింపు లభిస్తుంది. ఇది రోగులకు గణనీయమైన ఖర్చుని ఆదా చేస్తుంది.
(చదవండి: దేశ బడ్జెట్‌ని మార్చగలిగేది మహిళలే! ఎలాగంటే..!)
Comments
Please login to add a commentAdd a comment