
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థలను ఒక్కటి చేయాలని నిర్ణయించిన కేంద్రం... ఈ విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు గాను కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ను విలీనం చేయాలనుకుంటున్నట్టు ఈ ఏడాది బడ్జెట్ సమయంలోనే ప్రభుత్వం ప్రకటించింది.
విలీనం ద్వారా బలమైన కంపెనీని సృష్టించడం, సంస్థ వ్యాపార విలువను, వాటాదారుల విలువను పెంచడం ప్రభుత్వ ఉద్దేశమని ఈ బీమా సంస్థలు తెలిపాయి. 2017 మార్చి నాటికి ఈ మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు ఉమ్మడిగా 200 బీమా ఉత్పత్తులుండగా, మొత్తం ప్రీమియం ఆదాయం రూ.41,461 కోట్లుగా ఉంది. మార్కెట్ వాటా 35 శాతం. ఉమ్మడి నికర విలువ రూ.9,243 కోట్లు. మొత్తం ఉద్యోగులు 44,000 మంది. కన్సల్టెంట్‌గా బిడ్లు వేసేందుకు జూలై 16 వరకు గడువు ఇచ్చారు.