బ్యాంకుల విలీనం మంచిదే! | Merging PSU banks will help: RBI’s Patel | Sakshi
Sakshi News home page

బ్యాంకుల విలీనం మంచిదే!

Published Wed, Apr 26 2017 1:00 AM | Last Updated on Fri, Aug 24 2018 7:18 PM

బ్యాంకుల విలీనం మంచిదే! - Sakshi

బ్యాంకుల విలీనం మంచిదే!

బాగున్న బ్యాంకులు ఇంకా బలపడతాయి
ఎన్‌పీఏల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
అక్కర్లేని బ్రాంచీలను అమ్మేస్తే నిధులొస్తాయి
అమెరికా వాణిజ్య రక్షణాత్మక విధానం సరికాదు
ఆర్‌బీఐ గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌ వ్యాఖ్యలు
2017–18లో వృద్ధి 7.4 శాతంగా అంచనా
 

న్యూయార్క్‌: కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థకు మంచి జరుగుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. మంచి బ్యాలెన్స్‌ షీట్లున్న బ్యాంకుల్లోకి విలీనాలు జరిగితే మొండిబకాయిలు, దానివల్ల ఒత్తిడిలో ఉన్న రుణ సమస్యలను ఎదుర్కోవటం సులువవుతుందని చెప్పారు.

ఆర్థిక వ్యవస్థలో పలు సానుకూల అంశాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ కొనసాగుతుందంటూ... అమెరికా రక్షణాత్మక విధానాలు సరికాదని స్పష్టంచేశారు. ఇక్కడి కొలంబియా యూనివర్సిటీలో కొటక్‌ ఫ్యామిలీ ప్రతిష్టాత్మక ఉపన్యాసమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ...

ఇన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరం లేదని చాలామంది చెబుతున్నారు. అవి కొద్ది బ్యాంకులుగా మారితే అదీ మంచి బ్యాలెన్స్‌ షీట్స్‌ ఉన్న బ్యాంకులుగా రూపాంతరం చెందితే అది బ్యాంకింగ్‌ వ్యవస్థకు మంచి ఫలితాలను అందిస్తుంది.

విలీనాల వల్ల అవసరంలేని ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్ని మూసివేయవచ్చు.అలాంటి బ్రాంచీలను మూసివేసినప్పుడు సంబంధిత రియల్టీ అమ్మకాల ద్వారా నిధులు సమకూరుతాయి. స్వచ్ఛంద పదవీ విరమణ పథకాల ద్వారా ఉద్యోగుల సంఖ్య సరిచేసుకోవచ్చు. టెక్నాలజీ మీద అవగాహన ఉన్న యువతకు బ్యాంకింగ్‌లో ఉపాధి దొరుకుతుంది కూడా.

మొండిబకాయిల సమాచారం అంతా ఆర్‌బీఐ వద్ద ఉంది. ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి గత ఏడాది ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంది. బ్యాంకుల సమగ్ర రుణ నాణ్యతను సమీక్షించింది కూడా.

దివాలా కోడ్‌కు అనుగుణంగా ఎన్‌పీఏల సమస్య పరిష్కార దిశలో తదుపరి అడుగులకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. కష్టాల్లో ఉన్న బ్యాంకుల విషయంలో తగిన దిద్దుబాటు చర్యలూ ఉంటాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటు క్యాపిటల్‌ను స్వయంగా సమకూర్చుకోవాలి. ఆయా అవసరాలకు కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడ్డం సరికాదు. నిర్వహణా పరమైన నిర్ణయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను బ్యాంకులు పాటించాలి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం మొత్తంమీద బ్యాంకింగ్‌ రంగానికి మంచిదే. మెరుగుపడిన మార్కెట్‌ విలువల  నేపథ్యంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ మరింత మేలు చేకూరుస్తుంది. మూలధన కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గడానికీ ఈ చర్య దోహదపడుతుంది.

ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో దేశంలో విస్తృతస్థాయి ఏకాభిప్రాయ సాధన ఏర్పడుతోంది. ఇది దేశాభివృద్ధికి దారితీస్తుంది. జీఎస్‌టీ, దివాలా కోడ్, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్‌(ఎఫ్‌ఐపీబీ) రద్దు వంటి అంశాలు ఇన్వెస్టర్‌ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి.

భారత్‌ ఆర్థిక అంశాలన్నీ పటిష్టంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది.కరెంట్‌ అకౌంట్‌ లోటు జీడీపీలో ఒక శాతంకన్నా తక్కువగానే ఉంది. బడ్జెట్‌కు అనుగుణంగా ద్రవ్యలోటును మూడు శాతంలోపే కట్టడిచేసే పరిస్థితి ఉంది.

డీమోనిటైజేషన్‌ ఇబ్బందులు ఉన్నప్పటికీ, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. డిజిన్వెస్ట్‌మెంట్‌ కాలాన్ని చూస్తే– కరెన్సీ కన్నా, క్రెడిట్‌ ముఖ్యం. రుణ సంబంధ ఇబ్బందులు ఎక్కడా తలెత్తలేదు.

రూపాయి విలువ అనేది పూర్తిగా మార్కెట్‌ నిర్ణయించే అంశం. ఒడిదుడుకులను నివారించడానికే ఆర్‌బీఐ జోక్యం. మున్ముందూ ఇదే విధానం కొనసాగుతుంది. ఆర్‌బీఐ పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement