ఈక్విటీల్లో తగ్గిన ఫండ్స్ పెట్టుబడులు
27 శాతం క్షీణతతో రూ.51,000 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో భారీ ఆటు పోట్ల నేపథ్యంలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టబడులు గణనీయంగా తగ్గాయి. 27 శాతం క్షీణతతో రూ.51,000 కోట్లకు పరిమితం అయ్యాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆ పరిస్థితి ఉండబోదన్న అభిప్రాయం వాటి నుంచి వినిపిస్తోంది. పరిశ్రమ పనితీరు మెరుగుపడుతుందని, నూతన ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న పెట్టుబడులతో వృద్ధి నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమైంది.
సెబీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు 2016–17లో స్టాక్ మార్కెట్లలో నికరంగా రూ.51,352 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. 2015–16లో వీరి పెట్టుబడులు రూ.70,130 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు 2014–15లో ఇవి రూ.41,000 కోట్లే. ఆరేళ్ల తర్వాత ఈక్విటీల్లో ఫండ్స్ నికరంగా పెట్టుబడులు పెట్టింది 2014–15లోనే. ఇక 2015–16తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం. అదే సమయంలో ఫండ్ మేనేజర్లు గత ఆర్థిక సంవత్సరంలో డెట్ మార్కెట్లో నికరంగా 3.14 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు.
పెరిగిన ఇన్వెస్టర్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఫండ్స్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు పెరగడం గమనార్హం. ఇందుకు సూచికగా ఫోలియోల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదైంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు, బ్యాలన్స్ విభాగాల్లో ఫోలియోల సంఖ్య 58 లక్షలు పెరిగి రూ.4.4 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో ఇన్వెస్టర్‌కు ఎన్ని ఫోలియోలు అయినా ఉండొచ్చు.