ముంబై : ప్రపంచవ్యాప్తంగా రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా మంగళవారం పతనమైంది. భారీ నష్టాల నుంచి మార్కెట్ కోలుకున్నప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌లో లాభాల స్వీకరణ కారణంగా నష్టాలు తప్పలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 75.51కు చేరడం, లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తారన్న అంచనాలు... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 31,500 పాయింట్లు, నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దీపన చర్యలు ప్రకటించవచ్చన్న ఆశలతో ట్రేడింగ్ చివర్లో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో 716 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 190 పాయింట్ల నష్టంతో 31,371 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 195 పాయింట్ల వరకూ పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 43 పాయింట్లు నష్టంతో 9,197 పాయింట్ల వద్దకు చేరింది.
రోజంతా నష్టాలు...
ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో నష్టాలు కొంచెం తగ్గాయి. రిలయన్స్ జియో–ఫేస్‌బుక్ డీల్‌కు వ్యతిరేకంగా జస్టిస్ బి.ఎన్. కృష్ణ వ్యాఖ్యలు చేయడంతో మార్కెట్ బలహీనంగా ట్రేడైందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ ఎస్. రంగనాధన్ వ్యాఖ్యానించారు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్ల దన్నుతో నష్టాలు తగ్గాయని వివరించారు. మరోవైపు కరోనా కేసులు తొలిసారిగా వచ్చిన వూహాన్‌లో చాలా వారాల తర్వాత రెండు రోజుల్లో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక దక్షిణ కొరియాలో కూడా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 1 శాతం, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
• రిలయన్స్ ఇండస్ట్రీస్ 6 శాతం నష్టంతో రూ.1,480 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ పది శాతం మేర పెరగడంతో లాభాల స్వీకరణ జరిగింది.
• దాదాపు 130కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఎస్‌బీఐ, డీసీబీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి.
నేడు భారీ గ్యాపప్‌తో ఓపెనింగ్!
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో భారీ ప్యాకేజీని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి గం.8.00కు ప్రకటించారు. ఈ తాజా ప్యాకేజీ, గతంలోని ప్యాకేజీ, ఆర్‌బీఐ ఉద్దీపనలను కూడా కలుపుకుంటే, మొత్తం ఉద్దీపన చర్యల విలువ రూ. 20 లక్షల కోట్ల మేర ఉంటుంది. ఇది మన జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం. ఈ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ భారీగా లాభపడింది. రాత్రి 11.30 ని.సమయానికి 426 పాయింట్లు (4.6 శాతం) లాభంతో 9,600 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో నేడు మన మార్కెట్ భారీ లాభాలతో ఆరంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ ప్యాకేజీ కోసమే మార్కెట్ ఎదురు చూస్తోందని, ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ ఉండొచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment