
డిజిటల్ ఇండియా ఆద్యుడు మోదీ కాదు.. రాజీవ్ గాంధీ
డిజిటల్ ఇండియా ప్రారంభ కర్త ప్రధాని మోదీ కాదని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ప్రముఖ టెక్నోక్రాట్, దేశీయ టెలికాం విప్లవ పితామహుడు సత్యనారాయణ గంగారామ్ పిట్రోడా (శామ్ పిట్రోడా) అన్నారు.
ముంబై: డిజిటల్ ఇండియా ప్రారంభ కర్త ప్రధాని మోదీ కాదని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ప్రముఖ టెక్నోక్రాట్, దేశీయ టెలికాం విప్లవ పితామహుడు సత్యనారాయణ గంగారామ్ పిట్రోడా (శామ్ పిట్రోడా) అన్నారు.దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన రాజీవ్ గాంధీ క్రెడిట్‌ను మోదీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుందని ధ్వజం ఎత్తారు. ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రచారంలో ప్రస్తుత తరం కొట్టుకుపోరాదని ఆయన హెచ్చరించారు. డిజిటల్ ఇండియా విప్లవం 25 ఏళ్ల కిందటే ప్రారంభమైందని చెప్పారు.
డిజిటల్ ఇండియా రూపకల్పనకు మరో 20 ఏళ్లు పడుతుందన్నారు. ఆయన ఇక్కడ జరిగిన తన స్వీయ జీవిత చరిత్ర పుస్తకమైన ‘డ్రీమింగ్ బిగ్: మై జర్నీ టు కనెక్ట్ ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆవిష్కరించారు. రాజీవ్ గాంధీ హయాంలో నేషనల్ సెంటర్ ఫర్ ఇన్‌ఫర్‌మ్యాటిక్స్ (ఎన్‌సీఐ) ఏర్పాటుతోనే డిజిటల్ ఇండియా విప్లవం ప్రారంభమైందని పిట్రోడా తెలిపారు. డిజిటల్ ఇండియా ఒక సుదీర్ఘ ప్రక్రియ అని రాత్రికి రాత్రే జరిగిపోదని పేర్కొన్నారు.
అయితే మోదీ ప్రభుత్వం మరింత పట్టుదలతో డిజిటల్ ఇండియా ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నదని ఆయన ప్రశంసించారు. అమెరికా టెక్నాలజీ పరిశ్రమలో పనిచేస్తున్న పిట్రోడాను రాజీవ్ 1984లో ఆహ్వానించి టెలికాం కమిషన్ ఛైర్మన్ బాధ్యతల్ని అప్పగించారు. ఆయన తరువాత ఎన్‌సీఐతో పాటు సీ-డాట్‌ను దేశంలో ప్రారంభించారు. సమావేశంలో ముకేశ్ మాట్లాడుతూ తన స్నేహితుడు, మార్గదర్శి, తాత్వికుడు అయిన పిట్రోడా భారత్‌లో టెలికాం విప్లవానికి నాంది పలికారన్నారు. భవిష్యత్తును దర్శించి, దానిని సృష్టించేందుకు చేయవేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు.