
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రా, మనీలాకు చెందిన మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ల సంయుక్త భాగస్వామ్య సంస్థ... ఫిలిప్పైన్స్‌లోని విమానాశ్రయ ప్రాజెక్టుకు తక్కువ కోట్ చేసిన బిడ్డర్‌గా నిలిచింది. క్లార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణానికి ఫైనాన్షియల్ బిడ్ దాఖలుకు 5 కంపెనీలు ఎంపిక కాగా.. వీటిలో ఇదొకటి. కాంట్రాక్టు దక్కించుకునే విషయంలో బాగా పోటీ ఉందని బేసెస్ కన్వర్షన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్ జేక్ బిన్‌కాంగ్ తెలిపారు. మెగావైడ్–జీఎంఆర్ జేవీ ఆఫర్‌ను పరిశీలిస్తామని చెప్పారు.
డిసెంబరు 18న ఎంపికైన కంపెనీని ప్రకటిస్తారు. డిసెంబరు 20న కొత్త టెర్మినల్‌కు శంకుస్థాపన చేసే అవకాశముంది. ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంది. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుకు టెండర్లను 2018లో పిలుస్తారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1,614 కోట్లు. 2020 నాటికి విస్తరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా 40 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి ఉంది. దీనిని 1.2 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేరుస్తారు. ఇప్పటికే జీఎంఆర్ ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ ప్రాజెక్టును మెగావైడ్‌తో కలిసి చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment