
భారత్ కుబేరుల్లో.. ముకేశ్ అంబానీ టాప్
‘హురున్’ గ్లోబల్ లిస్ట్ 2016 వెల్లడి
బీజింగ్: అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా రిలయన్స్ ముకేశ్ అంబానీ నిలిచారు. ఆయన సంపద 30 శాతం వృద్ధితో 2,600 కోట్ల డాలర్లకు పెరిగిందని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2016 వెల్లడించింది. ప్రపంచవ్యాప్త అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన 21వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 8,000 కోట్ల డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 111కు పెరిగిందని, అధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా, చైనా తర్వాతి స్థానం మనదేనని ఈ జాబితా తెలిపింది. గత ఏడాదితో పోల్చితే భారత బిలియనీర్ల సంఖ్య 14 పెరిగిందని, మొత్తం ఈ 111 బిలియనీర్ల సంపద 16 శాతం వృద్ధితో 30,800 కోట్ల డాలర్లకు ఎగసిందని పేర్కొంది. 10వేల కోట్ల డాలర్ల సంపద సాధించిన జీవించి ఉన్న ఏకైక వ్యక్తిగా బిల్‌గేట్స్ నిలిచారని, అయితే తన సంపదలో 2,000 కోట్ల డాలర్లు విరాళాలుగా ఇవ్వడంతో ఆయన సంపద 8,000 కోట్ల డాలర్లుగా ఉందని ఆ నివేదిక వివరించింది. బిల్‌గేట్స్‌తర్వాత 6,800 కోట్ల డాలర్ల సంపదతో వారెన్ బఫెట్ రెండో స్థానంలో నిలిచారు.