
ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ 2019 ఏడాదికి సంబంధించి ప్రకటించిన 100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో ముకేశ్ నిలిచారు. ఇంకా ఈ ర్యాంకింగ్స్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ తదితరులున్నారు. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్ పాలసీ... పూర్తి జాబితాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.
‘44.3 బిలియన్ డాలర్ల సంపదతో 2018లో జాక్ మాను వెనక్కినెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే నంబర్ వన్ అపర కుబేరుడిగా అవతరించారు. ప్రధానంగా చమురు, గ్యాస్, రిటైల్ స్టోర్ల ద్వారా ఆయన ఈ స్థాయిలో సంపదను దక్కించుకున్నారు. అయితే, కొత్తగా ప్రారంభించిన రిలయన్స్ జియో ద్వారా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఫేస్‌బుక్, గూగుల్‌లకు కూడా పోటీనిచ్చే సత్తా జియోకు ఉంది’ అని ఫారిన్ పాలసీ పేర్కొంది. కాగా, మొత్తం జాబితాను 10 విభాగాలుగా విభజించామని, అందులో ముకేశ్ అంబానీ... టాప్–10 టెక్నాలజీ థింకర్స్‌లో నిలిచినట్లు వెల్లడించింది. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్‌కు కూడా చోటు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment