
ఇది ‘భారతీయ శకం’ కావాలి
యువతకు ముకేశ్ పిలుపు
• ముంబై వర్సిటీ 160వ స్నాతకోత్సవంలో ప్రసంగం
ముంబై: భారత శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో చాటిచెప్పేందుకు దేశంలోని యువత, విద్యార్థులు పాటుపడాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దాన్ని ‘భారతీయ శకం’గా మార్చేందుకు కృషిచేయాలని కోరారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, యంత్రాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. మానవీయ కోణం మాత్రం కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ముంబై విశ్వవిద్యాలయం 160వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ముకేశ్ ఈ వ్యాఖ్య లు చేశారు. ‘మానవ చరిత్రలో ప్రపంచం ఇప్పుడు మౌలికంగా కొత్త దశలోకి అడుగుపెట్టింది.
మొట్టమొదటి పారిశ్రామిక విప్లవంలో యాంత్రిక ఉత్పాదకత కోసం నీరు, ఆవిరి శక్తిని ఉపయోగించుకున్నారు. ఆతర్వాత విద్యుత్ శక్తితో భారీస్థాయి ఉత్పాదకతను సాధించగలిగాం. ఇక మూడో పారి శ్రామిక విప్లవంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ వినియోగం కీలకంగా నిలిచాయి. ఇప్పుడు నడుస్తున్న నాలుగోది.. డిజిటల్ విప్లవం. దీనిద్వారా భౌతిక, డిజిటల్, బయలాజికల్ ఆవరణాల మధ్య నెలకొన్న తెరలన్నీ కలగలిసిపోతున్నాయి. ఒక సరికొత్త ప్రపంచం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. గతంతో పోలిస్తే ఇది చాలా విభిన్నమైనది’ అని అంబానీ పేర్కొన్నారు.
ప్రపంచం మీ మునివేళ్లపై...
‘ఇప్పుడు మనమంతా సాంకేతిక విప్లవం ముంగిట్లో నిలుచున్నాం. ప్రజల జీవన గమనం, ఇతరులతో మన సంబంధాలు, పనితీరుకు సంబంధించి మూలాలను ఇది మార్చేయనుంది. ఉదాహరణకు కొత్త పరిజ్ఙానాల ఆధారంగా పుట్టుకొచ్చిన కొన్ని వ్యాపారాలన్నీ రాత్రికిరాత్రే ఆవిర్భవించాయి. పదేళ్లక్రితం వాటిని మనం ఊహించలేదు కూడా. అయినా కూడా ఇప్పుడు ఈ వ్యాపారాలు బహుళజాతి కార్పొరేట్ దిగ్గజాలుగా విస్తరించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసించే స్థాయికి చేరాయి. భవిష్యత్తులో ప్రపంచ జీడీపీలో 65 శాతం గడిచిన రెండు దశాబ్దాల్లో పురుడుపోసుకున్న సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన వ్యాపారాల ద్వారానే సమకూరనుంది. గడిచిన 300 ఏళ్ల నాగరికతలో ప్రపంచం సాధించినదాని కంటే మరెంతో ప్రగతిని వచ్చే 30 ఏళ్లలోనే మనం చూడబోతున్నాం’ అన్నారు.
మానవ చరిత్రలో నిజమైన చరిత్రాత్మక దశలో ప్రస్తుత తరం పట్టభద్రులవుతున్నారని... ఇదే అత్యంత విద్యావంతమైన తరమని అంబానీ పేర్కొన్నారు. ‘ప్రపంచం ఇప్పుడు మీ మునివేళ్లపై ఆవిష్కృతమవుతోంది. అవకాశాలు కోకొల్లలు. అయితే, మానవీయ కోణంలోనే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ భుజస్కందాలపై ఉంది. ఇప్పటికీ కోట్లాది మంది సరైన తిండి, నీరు, ఇళ్లు, విద్యుత్, రవాణా సౌకర్యాలు, ఉపాధికి దూరంగా ఉన్నారు. ఈ సవాళ్లను అధిగమించి ఒక సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి అందరూ పాటుపడాలి’ అని ముకేశ్ విద్యార్థులకు సూచించారు. ముంబై వర్సిటీలోనే తాను కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నానని.. 4 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటానని ఎన్నడూ ఊహించలేదని అంబానీ వ్యాఖ్యానించారు.