
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ 2017 సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లో రూ.1.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టగా, 2018 పట్ల కూడా ఎంతో ఆశాభావంతో ఉన్నాయి. 2016లో చేసిన ఈక్విటీ పెట్టుబడుల కంటే రూ.48,000 కోట్లు అధికం. ‘‘రియల్ ఎస్టేట్, బంగారం కంటే ఆర్థిక సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇక ముందూ కొనసాగే అవకాశం ఉంది.
మ్యూచువల్ ఫండ్స్ స్థిరమైన రాబడులు ఇస్తుండటం, వివేకంతో కూడిన రిస్క్ నిర్వహణ, ఇన్వెస్టర్లలో అవగాహనకు చేపడుతున్న చర్యలు మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తుల విస్తరణకు దోహదం చేస్తోంది’’ అని కోటక్ మ్యూచువల్ ఫండ్ సీఐవో హర్ష ఉపాధ్యాయ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీల్లో అధిక పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్ల బలమైన భాగస్వామ్యం చేదోడుగా నిలుస్తోంది. ఎక్కువ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఆధారంగా నడిచే స్టాక్ మార్కెట్లకు ప్రస్తుతం దేశీయ ఇన్వెస్టర్ల నుంచే తగినంత లిక్విడిటీ లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీనికి నిదర్శనం ఎఫ్‌పీఐలకు మించి ఈక్విటీల్లో ఫండ్స్ పెట్టుబడులు పెట్టడమే. ఎఫ్‌పీఐలు 2017లో రూ.50,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఏడాదిలో ఈక్విటీ పెట్టుబడులు రూ.20,500 కోట్లుగానే ఉన్నాయి. ‘‘ఈ ఏడాది దేశీయ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలను మించిపోయారు. దీంతో మార్కెట్ ఎఫ్‌పీఐల నిదులపై తక్కువగా ఆధారపడింది. దీనివల్ల ఎఫ్‌పీఐల పెట్టబడులు ఉపసంహరణ సమయాల్లోనూ మన మార్కెట్లకు తగినంత స్థిరత్వం ఏర్పడింది. దేశీయ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల మద్దతుగా స్టాక్ మార్కెట్లు ముందుకు కొనసాగాయి’’ అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment