
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మరింత పెద్ద మొత్తంలో వచ్చే దిశగా చేపట్టాల్సిన చర్యలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ‘యాంఫీ’ కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. ఇవన్నీ దాదాపుగా గతేడాది పంపిన ప్రతిపాదనలేనని, ఈ సారి బడ్జెట్లోనైనా వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని కోరామని యాంఫీ సీఈవో ఎన్‌ఎస్ వెంకటేశ్ తెలిపారు. యాంఫీ ప్రతిపాదనలు ఇవీ..
డెట్‌లింక్డ్ సేవింగ్స్ స్కీమ్
సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాల్లో(ఈఎల్‌ఎస్‌ఎస్) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సైతం సెక్షన్ 80సీసీసీ కింద అర్హత కల్పించాలి. డెట్ పథకాలకు పన్ను మినహాయింపు వల్ల సంప్రదాయ ఇన్వెస్టర్లు(రిస్క్ తీసుకోని వారు) సైతం పన్ను ప్రయోజనాలు పొందగలరు. దీనివల్ల బాండ్ మార్కెట్ విస్తృతి కూడా పెరుగుతుంది.
ఫండ్ ఆఫ్ ఫండ్స్
ఈక్విటీల్లో 65 శాతం పెట్టుబడులు పెట్టే ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణించాలి. ప్రస్తుతం దీన్ని డెట్ స్కీమ్‌గానే పరిగణిస్తున్నారు. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్‌లో కనీసం 65 శాతం పెట్టుబడులు పెట్టే పథకాలను ఈక్విటీగా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను మాత్రం అవి ఎందులో ఇన్వెస్ట్ చేశాయన్న అంశంతో సంబంధం లేకుండా డెట్ ఫండ్స్‌గానే చూస్తున్నారు. అందుకే యాంఫీ ఈ ప్రతిపాదన చేసింది.
పథకాల మధ్య సమానత్వం
పన్ను పరంగా మ్యూచువల్ ఫండ్స్, యులిప్‌లను ఒకే విధంగా చూడాలి. ఒకే పథకం పరిధిలో పెట్టుబడులను మార్చుకోవడం, ఒకే ఫండ్ హౌస్ పరిధిలో పథకాల మధ్య పెట్టుబడులను మార్చుకోవడాలను మూలధన లాభాల పన్ను నుంచి మినహాయించాలి. ప్రస్తుతం యులిప్ పాలసీల్లో ఇన్వెస్టర్లు వివిధ ఫండ్స్ మధ్య పెట్టుబడులను స్విచ్ చేసుకుంటున్నప్పటికీ పన్ను భారం ఉండటం లేదు.
ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ ప్లాన్
అమెరికాలో ఉన్న 401 (కె) ప్లాన్ మాదిరే... మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లాన్‌ను (ఎంఎఫ్‌ఎల్‌ఆర్‌పీ) యాంఫీ ప్రతిపాదించింది. ఉద్యోగ సంస్థ ఉద్యోగి తరఫున చేసే రిటైర్మెంట్ పొదుపులను వారి వేతనం నుంచి మినహాయించి చూపే అవకాశం ఈ ప్లాన్ కింద ఉంటుంది. దీనివల్ల మరింత పొదుపు నిధులు క్యాపిటల్ మార్కెట్లోకి తరలివస్తాయి.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్లాన్లు
‘సెక్షన్ 54ఈసీ’ని 3–5 ఏళ్ల లాకిన్‌తో పండ్ పథకాలకు కూడా వర్తింపచేయాలి. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ బాండ్, ఆర్‌ఈసీ బాండ్లలో చేసే పెట్టుబడులకు లాకిన్ పీరియడ్‌తో ఈ సెక్షన్ కింద మూలధన లాభాల పన్ను మినహాయింపు కల్పిస్తున్నారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలం పాటు ఉంచుకున్న ఆస్తులను విక్రయించినప్పుడు వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా ఇదే ప్రయోజనాన్ని 3–5 ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో అనుమతించాలి.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పునఃపరిశీలన
స్టాక్స్‌లో పెట్టుబడులను ఏడాది కాలం తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలపై పన్నును (ఎల్‌టీసీజీ) కేంద్ర ం గతేడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని పునరాలోచించాలన్నది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, బ్రోకరేజీ సంస్థలు, ఫండ్ మేనేజర్ల డిమాండ్ . ఎల్‌టీసీజీని రద్దు చేస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను మినహాయింపులు కల్పిస్తే బాండ్ మార్కెట్‌లోకి వచ్చే పెట్టుబడులు భారీగా పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది దాటిన తర్వాత విక్రయించిన స్టాక్స్‌పై లాభం రూ.లక్ష దాటితే 10% పన్నును కేంద్రం గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment