
న్యూఢిల్లీ: దేశీ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం వృద్ధి నమోదయినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ మూడవ వారం నాటికి మొత్తం వసూళ్లు రూ.4.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ స్థాయి వృద్ధి రేటును సాధించినట్లు సీబీడీటీ అధికారి ఒకరు సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 11.5 లక్షల కోట్లుగా ఉండాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న కేంద్ర ప్రభుత్వానికి... ఈ లక్ష్యంలో ఇప్పటివరకు 42 శాతం వసూళ్లు సమకూరినట్లయింది.
ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి 5.8 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలు కాగా, గతేడాది ఇదే సమయానికి అందిన 3.6 కోట్ల రిటర్నులతో పోలిస్తే ఈ సారి ఏకంగా 61 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో రిఫండ్స్ సైతం 62 శాతం పెరిగాయి. గతేడాది 1.22 కోట్లు (రూ.83,000 కోట్లు) రిఫండ్స్ జరుగగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 కోట్లు (రూ.1.09 కోట్లు) రిఫండ్స్ నమోదయ్యాయి. మరోవైపు పన్ను చెల్లింపుదారుల సంఖ్యను 1.25 శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐటీ శాఖ 1.85 కోట్ల మందికి ఈ–మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపించినట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 6.26 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులున్న విషయం తెలిసిందే.