
ముంబై: న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలిసారిగా ప్రపంచవ్యాప్త కవరేజీతో కూడిన గ్లోబల్ మెడిక్లెయిమ్ పాలసీని మంగళవారం ఆవిష్కరించింది. కేన్సర్, అవయవ మార్పిడి, బోన్‌మారో ఇలా ఆరు రకాల క్రిటికల్ ఇల్‌నెస్‌లకు 0.5 మిలియన్ డాలర్ల నుంచి 20 మిలియన్ డాలర్ల వరకు ఈ పాలసీలో కవరేజీ పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 100 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నట్టు న్యూఇండియా జనరల్ ఇన్సూరెన్స్ చైర్మన్, ఎండీ జి.శ్రీనివాసన్ మీడియాకు తెలిపారు.
18–75 సంవత్సరాల మధ్యనున్న వారు ఎటువంటి ముందుస్తు షరతులు లేకుండా ఆరు రకాల క్రిటికల్ ఇల్‌నెస్‌లకు కవరేజీ పొందొచ్చు. ఎన్ని రకాల క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీలను ఎంచుకున్నారు, వయసు తదితర అంశాలపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఒక దానికి కవరేజీ ఎంచుకుంటే ప్రీమియం రూ.5,672. ఆరు రకాల క్రిటికల్ ఇల్‌నెస్‌లకు కవరేజీ కోరుకుంటే ప్రీమియం రూ.12,716. అదే 75 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఒక దానికి కవరేజీ కోసం ప్రీమియం రూ.2,05,696 కాగా, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌తో కలిపితే వార్షిక ప్రీమియం రూ.4,95,899 అవుతుంది.