
న్యూఢిల్లీ: డేటా భద్రతకు నిర్దిష్టమైన చట్టం వచ్చే దాకా మొబైల్ డివైజ్‌లు, యాప్స్, బ్రౌజర్స్ మొదలైన వాటన్నింటికీ టెల్కోలకు అమలు చేస్తున్న నిబంధనలే వర్తిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ చెప్పారు. డేటాను హ్యాండిల్ చేసే డిజిటల్ సంస్థలన్నింటిపైనా నియంత్రణ ఉండాలని సూచించడంలో ట్రాయ్ తనకి అప్పగించిన బాధ్యతల పరిధిని దాటి వ్యవహరించిందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.
అంతిమంగా యూజర్లే తమ తమ డేటాకు యజమానులని, ఇతరత్రా సంస్థలన్నీ కస్టోడియన్లు మాత్రమేనని శర్మ స్పష్టం చేశారు. డేటాకు సంబంధించి భౌతిక ప్రపంచంలోనూ, డిజిటల్ ప్రపంచంలోనూ యాజమాన్య హక్కుల స్వభావం పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ‘‘డిజిటల్ ప్రపంచంలో ఒకే డేటా ఏకకాలంలో అనేక సంస్థలు, వ్యక్తుల దగ్గర ఉండొచ్చు. ఇలాంటప్పుడు సదరు డేటాపై యాజమాన్య హక్కులు ఎవరికుంటాయి, ఎవరి నియంత్రణలో ఉంటుంది? అనే ప్రశ్న తలెత్తుతుంది.
మాకు అప్పగించిన బాధ్య త కూడా దీన్ని పరిష్కరించమనే. అంతిమంగా యూజరే సదరు డేటాకు హక్కుదారు అవుతారని, వ్యవస్థలోని మిగతా సంస్థలన్నీ కూడా కస్టోడియన్స్ మాత్రమేనని సిఫార్సు చేశాం‘ అని శర్మ వివరించారు.ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఈ విధానానికి కట్టుబడి ఉంటున్న నేపథ్యంలో తమ సిఫార్సులకు పెద్ద వ్యతిరేకత ఉండబోదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.