విమాన టిక్కెట్ రద్దు ఛార్జీలు తగ్గిస్తారా?
న్యూఢిల్లీ : విమాన సంస్థలు అధికంగా వసూలు చేస్తున్న టిక్కెట్ రద్దు ఛార్జీలపై భారత ఏమియేషన్ రెగ్యులేటరీ అథారిటీ దృష్టి సారించింది. టిక్కెట్ రద్దు చార్జీలను వెంటనే తగ్గించాలని ఆదేశించింది. టిక్కెట్ బేస్ ధర కంటే రద్దు ఛార్జీలు అధికంగా ఉండకూడదని విమాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. బేస్ ధర కంటే ఎక్కువగా వసూలు చేసిన ఈ ఛార్జీలను వెంటనే కస్టమర్లకు చెల్లించాలని ఆదేశించింది. టిక్కెట్ ధర కంటే కూడా రద్దు ఛార్జీలే ఎక్కువగా ఉండటం వల్ల, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు ప్రయాణికులు ప్రయోజనం పొందడం లేదని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఓ సీనియర్ అధికారి చెప్పారు.
సర్వీసు పన్నులను, ఇతర ఎయిర్ పోర్టు ఛార్జీలను ప్రయాణికులు టిక్కెట్ ధరల్లోనే విమాన సంస్థలకు చెల్లిస్తుంటారని, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు వీటిని అసలు లెక్కలోకే తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇవి న్యాయసంబంధమైన విషయాలకు కిందకు వస్తాయని తెలిపారు. విమాన సంస్థలకు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నామని, వీటి గురించి ఇప్పటికే విమానసంస్థలతో డీజీసీఏ చర్చిందని, త్వరలోనే వీటిని ప్రకటిస్తారని తెలిపారు. టిక్కెట్ రద్దు చార్జీలు క్రమేపీ పెరుగుతూ పోతున్నాయని.. వీటిని అదుపులో ఉంచడానికి అథారిటీ ఈ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
జూన్ 7కి ఢిల్లీ-ముంబై మార్గానికి టిక్కెట్ బుక్ చేసుకుంటే, బేస్ ధర రూ.1,559 తో మొత్తం టిక్కెట్ ధర రూ.2,419గా ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు టిక్కెట్ ను రద్దు చేసుకుంటే అతని పొందేది కేవలం రూ.404 మాత్రమే. విమాన సంస్థలు అధిక రెవెన్యూల కోసమే ఈ ఛార్జీలను పెంచుకుంటూ పోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఇదే మొత్తంలో టిక్కెట్ ధరలను పెంచితే, ఎక్కడ కస్టమర్లు కోల్పోతారో అని ఆందోళనతో, ఈ మార్గాన్ని ఎంచుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.