
అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ పటిష్ట స్థాయికి చేరాయి. బంగారంలో ర్యాలీ మొదలైందా...? మున్ముందు మరింత పెరుగుదల ఉంటుందా? ఈ సమయంలో పెట్టుబడి పెట్టొచ్చా...? ఇలాంటి సందేహాలు ఎన్నో సామాన్య ఇన్వెస్టర్లలో ఉండటం సహజం. ఈ నేపథ్యంలో నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నదీ చూద్దాం..
అమెరికా– ఉత్తర కొరియా ఉద్రిక్త పరిస్థితులతోపాటు, అమెరికా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో డాలర్ బలహీనత అంచనాలు ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో 2017లో దాదాపు 150 డాలర్లు ఎగసింది. ఒకదశలో 200 డాలర్ల పెరుగుదలనూ నమోదుచేసుకుంది. భౌగోళిక ఉద్రిక్తతలూ, అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత వంటి అంశాలు ఈ ఏడాది పసిడిని ఏడాది గరిష్టస్థాయి 1,365 డాలర్లకు తీసుకువెళ్లాయి. అయితే 2 వారాల క్రితం 1,235 డాలర్లకు పడినప్పటికీ, మళ్లీ 1,300 డాలర్ల పైకి ఎగసింది. ఈ ర్యాలీ కొనసాగుతుందా? అన్న సందేహం రావడం సహజం. విశ్లేషకులు మాత్రం పెద్దగా ర్యాలీ ఉండకపోవచ్చంటున్నారు.
భౌగోళిక ఉద్రిక్తతలు.. డాలర్ ప్రభావం
ఉత్తరకొరియా అణు క్షిపణి ప్రయోగాలతో భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు ఉత్తరకొరియా తీరుపై మండిపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేని పరిస్థితి. ఇక డాలర్ బలహీన ధోరణి కొనసాగుతోంది. ఈ రెండు అంశాలూ ఇలానే కొనసాగితే మాత్రం అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్స్‌కు మళ్లీ 1360 డాలర్ల మార్కు వరకు వెళ్లే అవకాశాలున్నాయని ఏంజెల్ కమోడిటీస్‌కు చెందిన ముఖ్య విశ్లేషకుడు ప్రథమేష్ మాల్యా అభిప్రాయపడ్డారు.
డాలర్ బలహీనపడితే మాత్రం...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినప్పటికీ, (ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు 1.25–1.50 శాతం శ్రేణి) ట్రంప్ విధానాలపై ఆందోళనలు డాలర్‌ను బలహీనపరిచే అంశాలు. ఇవి బంగారానికి బలాన్నిస్తాయన్నది మరో విశ్లేషణ. రానున్న నెలల్లో బంగారం ధరలు పైదిశగా ఒక శ్రేణిలో చలిస్తాయని భావిస్తున్నట్టు జియోఫిన్ కామ్‌ట్రేడ్ రీసెర్చ్ హెడ్ హరీష్ చెప్పారు.
అంతర్జాతీయంగా బంగారం ట్రేడింగ్ డాలర్లలో జరుగుతుంటుంది. ప్రధాన కరెన్సీలతో డాలర్ కొంత బలహీనం అయిందని, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితేనే ఇది తిరిగి బలోపేతం కాగలదని విశ్లేషకుల అభిప్రాయం. కానీ, ట్రంప్ వివాదాస్పద ఆర్థిక విధానాలు డాలర్‌ను బలహీనపరిచే అవకాశం ఉంది.
బంగారం డిమాండ్ తక్కువే!!
బంగారం ధరలు ర్యాలీ చేయాలంటే దీనికి డిమాండ్ పెరగాలి. కానీ, ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గణాంకాలను పరిశీలిస్తే బంగారానికి డిమాండ్ 2017 తొలి ఆరు నెలల కాలంలో 14 శాతం తగ్గి ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి 2,003.8 టన్నులకు చేరింది. దేశీయంగా జీఎస్టీ తర్వాత బంగారానికి డిమాండ్ తగ్గిపోయినట్టు మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీస్‌కు చెందిన సహాయ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమాని తెలిపారు.
జీఎస్టీ అన్నది భారీ పారదర్శకతను తీసుకొచ్చే సంస్కరణ అని, బంగారు ఆభరణాల వ్యాపారం ఎక్కువ శాతం అవ్యవస్థీకృత రంగంలో ఉన్నందున పరిస్థితులు సర్దుకోవడానికి 12–18 నెలలు పడుతుందని ప్రపంచ స్వర్ణ మండలి భారత విభాగం ఎండీ పీఆర్ సోమసుందరం చెప్పారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ బంగారానికి డిమాండ్ తక్కువగానే ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు చాలా రాష్ట్రాల్లో పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో రైతుల ఆదాయం తగ్గిపోతుందని, ఆ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్‌పై ఉంటుందని నివేష్ కమోడిటీస్ డైరెక్టర్ మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు.
కొనుగోలుకు ఇది సరైన సమయమా?
బంగారం ఈ స్థాయి నుంచి గణనీయంగా పెరిగే అవకాశాలు లేవని ఎక్కువ మంది అనలిస్టులు చెబుతున్నారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కరెక్షన్ వరకు ఆగి తగ్గిన తర్వాత పరిశీలించొచ్చన్నది వారి సూచన. అయితే, అసాధారణ పరిణామాల నుంచి తమ పెట్టుబడుల విలువను రక్షించుకునే చర్యల్లో భాగంగా పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని కొనసాగించే వారు కొందరుంటారు. వారు కొనుగోళ్లకు వెళ్లొచ్చని అవుట్‌లుక్ ఆసియా క్యాపిటల్ సీఈవో మనోజ్ నాగ్‌పాల్ సూచించారు. ఈక్విటీ మార్కెట్లు గరిష్ట విలువల్లో ఉండటం, భౌగోళిక ఉద్రిక్తతల పరిస్థితులను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
దిగుమతి సుంకంతో ధరలది ఎగువబాటే?
గత తొమ్మిది నెలల కాలంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 69 నుంచి 64కు దిగొచ్చింది. నిపుణులు మాత్రం ఇది ఎక్కువ కాలం కొనసాగుతుందని భావించడం లేదు. నిధుల ప్రవాహం వల్ల స్వల్ప కాలంలో బంగారం ధర కొంత మేర పెరగొచ్చని, రూపాయి వచ్చే ఏడాది పాటు 64–65 స్థాయిలోనే కొనసాగొచ్చని వారు అంచనా వేస్తున్నారు.
మన దగ్గర బంగారం ధరలు అధికంగా ఉండటానికి కారణం ప్రభుత్వం దిగుమతులపై 10 శాతం పన్ను వేయడమే. దిగుమతులు తగ్గించటానికి ఈ పన్నులు విధించిన ప్రభుత్వం... భౌతిక బంగారంలో పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా గోల్డ్ బాండ్లను ప్రమోట్ చేస్తోంది. కనుక దిగుమతి సుంకం తగ్గించే అవకాశాల్లేవని మనోజ్ కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు.
బంగారంపై పెట్టుబడి ఏ రూపంలో?
ఆభరణాల రూపంలో కొంటే ఎన్నో రకాల అదనపు చార్జీలు పడతాయి. భౌతిక రూపంలోనే బంగారాన్ని కొనాలనుకుంటే ఆభరణాలకు బదులు కడ్డీలు, కాయిన్ల రూపంలో కొనుగోలు చేయటం నయం. తరుగు, అదనపు చార్జీల రూపేణా నష్టం ఉండదు. పసిడి ఏ రూపంలో కొన్నా జీఎస్టీ భారం ఉండనే ఉంది.
బంగారం బార్లను కొన్నప్పుడు 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. అసాధారణ ఆర్థిక పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న బంగారం కంటే భౌతిక రూపంలో ఉన్న బంగారానికే డిమాండ్ ఉంటుందని మరో విశ్లేషణ. ఆర్‌బీఐ జారీ చేసే సౌర్వభౌమ బంగారం బాండ్లు మరో ఆప్షన్. పెట్టుబడి కోణంలో ఇది ఉత్తమ సాధనం. ఎందుకంటే వార్షికంగా వడ్డీ పొందడానికి అవకాశం ఉంది. ఐదేళ్లకు పైన పెట్టుబడులు కొనసాగించే వారికి ఇవి అనువైనవి.
బంగారం ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మూడో ఆప్షన్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెంటనే నగదు పొందాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు అనువుగా ఉంటాయి. ఎందుకంటే వీటికి లిక్విడిటీ ఎక్కువ. అయితే ఈటీఎఫ్ పెట్టుబడుల విలువపై ఫండ్ హౌస్ వార్షికంగా ఒక శాతం వ్యయాల పేరుతో మినహాయించుకోవడం ప్రతికూలం.
దూసుకుపోయిన పసిడి....
♦ వారంలో 26 డాలర్ల పెరుగుదల
♦ అప్‌ట్రెండ్ వరుసగా ఇది మూడవవారం
♦ డాలర్ ఇండెక్స్ పతనం నేపథ్యం...
అంతర్జాతీయంగా పసిడి వరుసగా మూడవ వారమూ పరుగుపెట్టింది. వారంలో 26 డాలర్లు ఎగసి ఏకంగా కీలక నిరోధస్థాయి 1,300 డాలర్లను దాటి 1,305 డాలర్ల వద్ద ముగిసింది. దీనితో అంతర్జాతీయ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజ్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర మూడు వారాల్లో దాదాపు 50 డాలర్ల పెరిగినట్లయ్యింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి 200 రోజుల కదలికల సగటు 1,277.70 డాలర్లు. డాలర్ ఇండెక్స్ భారీ పతనం దీనికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. గడచిన వారంలో 0.89 సెంట్లు పతనమై, 91.99 వద్ద ముగిసిన డాలర్ ఇండెక్స్, అంతక్రితం వారంలో 1.08 డాలర్లు పతనమైన సంగతి తెలిసిందే. డాలర్ ఇండెక్స్ 52 వారాల కనిష్టస్థాయి 90.99 వైపు పయనిస్తే, అది పసిడి అప్‌ట్రెండ్‌కు మరింత ఊతం ఇస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
దేశీయంగా పరుగు...
అంతర్జాతీయంగా పసిడి పెరుగుదల, దేశీయంగా రూపాయి పటిష్టత వల్ల (అంతర్జాతీయ మార్కెట్‌లో వారంలో 25 పైసలు బలపడి 63.87) దేశంలోనూ బంగారం మెరిసింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్– ఎంసీఎక్స్‌లో వారంలో ధర రూ.500 పెరిగి పెరిగి రూ.29,165 కు చేరింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారంవారీగా 99.9 స్వచ్ఛత ధర రూ.545 పెరిగి రూ. 29,390 వద్ద ముగిసింది. వెండి ధర కేజీకి రూ.1,245 లాభపడి రూ. 38,425 వద్ద ముగిసింది. 2017లో దేశీయంగా బంగారం రూ.28,050 నుంచి రూ.29,390కి చేరింది. ఒకదశలో గరిష్టస్థాయి రూ.31,300 స్థాయినీ దాటింది.