
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్‌లైన్‌లో పాన్ నంబరు కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రారంభించారు. ‘ఆధార్ నంబరుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్ నంబరు ఉండి, పాన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా పేపర్ రహితంగా, ఎలక్ట్రానిక్ పాన్ (ఈ–పాన్) నంబరును ఉచితంగా కేటాయించడం జరుగుతుంది’ అని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ఈ–ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తుదారు ఇన్‌స్టంట్ పాన్ పొందవచ్చు.
వెబ్‌సైట్‌లో తన ఆధార్ నంబరు పొందుపర్చాక, దానికి అనుసంధానమైన దరఖాస్తుదారు మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీని సమర్పించాక 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నంబరు వస్తుంది. కేటాయింపు పూర్తయ్యాక ఈ–పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్‌తో రిజిస్టరైన మెయిల్–ఐడీ ఉంటే దానికి కూడా ఈ–మెయిల్ వస్తుంది. తక్షణం పాన్ కేటాయించే ప్రక్రియకు సంబంధించిన బీటా వెర్షన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆదాయపు పన్ను శాఖ తమ ఈ–ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మే 25 దాకా దీని ద్వారా 6,77,680 పాన్ నంబర్లు కేటాయించింది. కేవలం 10 నిమిషాల్లోనే ఈ–పాన్ కేటాయించగలిగినట్లు సీబీడీటీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment