
5 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్‌ఎండీసీ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికర లాభంలో 34 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది (2012-13) ఇదే కాలానికి రూ. 1,465 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ.1,962 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 21 శాతం పెరిగి రూ.3,204 కోట్ల నుంచి రూ. 3,884 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం మీద చూస్తే నికర లాభం రూ. 6,342 కోట్ల నుంచి రూ. 6,420 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 10,704 కోట్ల నుంచి రూ. 12,058 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద లాభాల్లో వృద్ధి శాతం తక్కువగా ఉండటానికి వేతన సవరణ, ఎగుమతులకు సంబంధించి వ్యయం కారణంగా ఎన్‌ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నరేంద్ర కొఠారి పేర్కొన్నారు.
ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎండీసీ తొలిసారిగా ముడి ఇనుము ఉత్పత్తి అమ్మకాల్లో 3 కోట్ల టన్నులు దాటినట్లు తెలిపారు. ఈ ఏడాది 3.1 కోట్ల టన్నుల ఉత్పత్తి, గతేడాది మిగులుతో కలిపి 3.2 కోట్ల టన్నుల అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొఠారి తెలిపారు. ఇప్పుడిప్పుడే ఇనుముకు డిమాండ్ పెరుగుతోందని, ఏడాది మొత్తం మీద చూస్తే ధరలు పెరగడమే కాని తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు.
సొంత నిధులతోనే స్టీల్‌ప్లాంట్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌లు...
2019-20 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ముడి ఇనుము ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 కోట్ల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొఠారి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ ఏడాది స్టీల్ ప్లాంట్, గనుల విస్తరణ కోసం రూ.3,495 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. గతేడాది కంపెనీ రూ. 2,518 కోట్లు విస్తరణ కోసం ఖర్చు చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్, క్యాపిటివ్ విద్యుత్ ప్రాజెక్టులను సొంత నిధులతోనే ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం కంపెనీ దగ్గర ఉన్న రూ.18,000 కోట్ల మిగులు నిధులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నగర్‌నర్‌లో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ 2016-17కి అందుబాటులోకి వస్తుందని అంచనా.
విదేశీ విస్తరణపై దృష్టి
విదేశాల్లో బొగ్గు, బంగారం, డైమండ్స్, ఫాస్పేట్ గనులపై దృష్టిసారిస్తున్నట్లు ఎన్‌ఎండీసీ ప్రకటించింది. ఇందుకోసం ఇండోనేషియాలో బొగ్గు గనులు, మొజాంబిక్, ఆస్ట్రేలియాలో ఇనుప ఖనిజాలు, రష్యాలో రాక్ ఫాస్పేట్ గనులపై మదింపు చేస్తున్నామని, వీటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కొఠారి తెలిపారు.