ఎన్‌ఎండీసీ లాభం 1,593 కోట్లు
* క్యూ3 ఆదాయం రూ. 2,943 కోట్లు
* హుద్‌హుద్ ప్రభావంతో 5 శాతం తగ్గిన అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హుద్ హుద్ తుపాన్ ప్రభావం ప్రభుత్వరంగ ఎన్‌ఎండీసీ ఫలితాలపై కనిపించింది. మూడో త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడంతో నికర లాభం స్వల్పంగా పెరిగింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గతేడాదితో పోలిస్తే 1.6% వృద్ధితో రూ. 1,567 కోట్ల నుంచి రూ. 1,593 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో అమ్మకాలు 5 శాతం క్షీణించి 6.97 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి.
హుద్ హుద్ తుపాన్ వల్ల రైల్వే ట్రాకులు దెబ్బ తినడంతో కొద్దిరోజులు రవాణా జరగలేదని, అమ్మకాలు తగ్గడానికి ఇది కారణమని ఎన్‌ఎండీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ఇదే సమయంలో ముడి ఇనుము ఉత్పత్తి మాత్రం 11% వృద్ధితో 8.11 మిలియన్ టన్నులకు చేరింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,823 కోట్ల నుంచి రూ. 2,946 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ఈ నెల టన్ను ముడి ఇనుము ధర రూ. 450 వరకు తగ్గించామని, దీని ప్రభావం నాల్గవ త్రైమాసిక ఆదాయం, లాభాలపై కనిపిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
రూ.4.25 మధ్యంతర డివిడెండ్
రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు రూ. 4.25 మధ్యంతర డివిడెండ్ ఎన్‌ఎండీసీ బోర్డు సిఫార్సు చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రకటించిన డివిడెండ్ విలువ రూ.7.25కి చేరింది.