నో ఫ్లై రూల్స్: మహిళపై తొలి కేసు
సాక్షి, ముంబై: విమానయాన రంగంలో తాజాగా అమల్లోకి వచ్చిన నో ఫ్లై నియమాల ప్రకారం ఓ మహిళపై తొలి కేసు నమోదయింది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆమెపై దర్యాప్తు మొదలైంది. జైపూర్-ముంబై ఇండిగో ప్రయాణించిన ఆర్ థాకూర్ అనే మహిళ విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ బృందం విమానాశ్రయంలోని సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది.
మరోవైపు విమాన సిబ్బందే తనతో క్రూరంగా ప్రవర్తించారని థాకూర్ ఆరోపించారు. ఈ మేరకు కౌంటర్ ఫిర్యాదును కూడా నమోదు చేశారు. ఈ వివాదాన్ని ధ్రువీకరించిన ఇండిగో ఎయిర్ లైన సదరు ప్రయాణికురాలిపై తీసుకునే చర్యలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా గత వారం డీసీజీఏ ఆవిష్కరించిన నిబంధనల ప్రకారం, ప్రయాణికులు ఎవరైనా విమానంలో దురుసుగా ప్రవర్తిస్తే మూడు నెలల నుంచి జీవితకాలం నిషేధం విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటలు, భౌతిక దాడి లేదా లైంగిక దాడి, హత్యాయత్నం అనే మూడు విభాగాలుగా విభజించారు. నిషేధం వ్యవధి ప్రవర్తన తీవ్రతపై ఆధారపడి ఉంటుందని డీజీసీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.