రూ.2000 నోటుపై ప్రభుత్వం స్పందించింది
రూ.2000 నోటుపై ప్రభుత్వం స్పందించింది
Published Fri, Jul 28 2017 6:35 PM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM
న్యూఢిల్లీ : రూ.2000 నోటును రద్దు చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు కేంద్రప్రభుత్వం చెక్ పెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. అంతేకాక త్వరలోనే కొత్తగా రూ.200 నోటును చలామణిలోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ''రూ.2000 నోట్లు రద్దు చేయబోతున్నారనే వార్తలేమీ లేవు'' అని గంగ్వార్ చెప్పారు. కొత్త రూ.2000 నోట్ల ముద్రణను తగ్గించడమేది భిన్నమైన అంశమని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి దీనికి సంబంధించి ధృవీకరణ రావాల్సి ఉందన్నారు. రూ.2000 నోట్లపై సమాచారం ఆర్బీఐనే ఇస్తుందని కూడా స్పష్టంచేశారు. ఇటీవల వచ్చిన రిపోర్టుల ప్రకారం ప్రభుత్వం రూ.2000 నోట్ల ముద్రణను ఆపివేసిందని తెలిసింది. జూలై 26న ఈ విషయంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణను కూడా డిమాండ్ చేశాయి.
డీమానిటైజేషన్ తర్వాత తీసుకొచ్చిన కొత్త రూ.2000 నోటును రద్దు చేస్తున్నారా? అందుకే ప్రింటిగ్ ఆపివేశారా? అంటూ నిలదీశాయి. కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు ఆర్థికమంత్రి ఎలాంటి సమాధానమివ్వలేదు. కొత్త రూ.2000 నోటును లీగల్ టెండర్ లాగా కొనసాగిస్తూ చలామణిని పరిమితం చేస్తుందని, కానీ రద్దు చేసే అవకాశం లేదని ఓ వైపు ఇండస్ట్రి నిపుణులు కూడా చెప్పారు. కొత్త రూ.200 నోటును ప్రవేశపెట్టి, మార్కెట్‌లో నెలకొన్న చిన్న నోట్ల సమస్యకు చెక్ పెడుతుందని తెలిపారు. ఇప్పటికే రూ.200 నోటు ప్రింటింగ్ మొదలైందని, వీటిని త్వరలోనే చలామణిలోకి తీసుకొస్తామని గంగ్వార్ శుక్రవారం కూడా చెప్పార. ఈ కొత్త రూ.200 నోటుతో చిన్న నోట్ల సర్క్యూలేషన్‌ను పెంచుతామన్నారు. ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు ఈ నోటును ఆగస్టులో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement