ఇంజిన్ పాడైనా ఇబ్బంది లేదు..!
వర్షాకాలం వచ్చిం దంటే... రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. నీటి ప్రవాహం... ట్రాఫిక్ జామ్... లోతు గుంతల్లో వాహనాలు చిక్కుకోవడం ఇంజిన్ ఆగిపోవడం... తిరిగి ఇంజిన్ ఆన్ చేయడానికి ఇబ్బందులు... ఈ ప్రయత్నంలో ఇంజిన్ వైఫల్యం... మరమ్మతులకు భారీ వ్యయం... ఇలాంటి సమస్యలెన్నో వాహన యజమానులను వేధిస్తుంటాయి.
ముందస్తు జాగ్రత్తలు
వర్షాకాలానికి ముందు ఆయా ప్రతికూలతలను ఎదుర్కొనడానికి వాహన యజమానులు తగిన చర్యలు తీసుకోవాలి. భారీ వర్షం. నీటి ప్రవాహం. రోడ్డుపై ఏర్పడే గుంతల్లో హఠాత్తుగా కారు ఇంజిన్ ఆగిపోతే... అది మనకేకాదు. మన పక్క వాహన యజమానులకూ మనం తీవ్ర ఇబ్బందిని సృష్టించినవారిమవుతాం. వర్షాకాలం ముందస్తు చెకప్స్, సర్వీసింగ్ వంటి చొరవలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ఒక్కసారి బీమా, క్లెయిమ్‌ల సంగతులపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది.
హైడ్రోస్టాటిక్ నష్టం
ఇప్పుడు కార్లు లేదా మోటార్ బైక్‌లు తీసుకుందాం. భద్రత, తగిన ప్రమాణాల డ్రైవింగ్‌కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఇందులో అమర్చుతున్నారు. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఆధునిక సాంకేతికత కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుంది. వర్షాకాలం- రోడ్లపై నీటి ప్రవాహంలో కనబడని పెద్ద గుంతల్లో టైర్లు చిక్కుకుపోయి కార్ల ఇంజిన్ ఆగిపోయే అవకాశం, గేర్లు మారుస్తూ అక్కడి నుంచి కారును వెలుపలికి తీసుకువచ్చే ప్రయత్నంలో ఇంజిన్ విఫలమై జరిగే నష్టం వంటి అంశాలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలి. దీనినే ‘హైడ్రోస్టాటిక్ నష్టం’గా పేర్కొంటుంటారు.
ఇంజిన్ విషయానికి వస్తే..
వాహన ఇంజిన్లు ‘కంబషన్’ అనే సూత్రంపై పనిచేస్తుంటాయి. డ్రైవింగ్‌కు సంబంధించి ఇంజిన్ సిలిండర్‌లోని ఇంధనాన్ని మండించడం, ఇందుకు వీలుగా పీడనాన్ని సృష్టించడానికి నిరంతర వాయువుల సరఫరా... శక్తి విడుదల ఇత్యాధి అంశాలన్నీ ఈ సూత్రంలో ఇమిడి ఉంటాయి. వర్షపు నీటి గుంతల్లో కారు చిక్కుకుపోయి... దానిని అక్కడ నుంచి గేర్లు మారుస్తూ, బలవంతంగా బయటకు తీసే క్రమంలో మనం పైన పేర్కొన్న ‘ఇంజిన్ ఫోర్స్’ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా ఇంజిన్ భారీ నష్టానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదే ‘హైడ్రోస్టాటిక్ నష్టం’.
కాన్సిక్వెంటల్ నష్టం
ఈ తరహా ‘హైడ్రోస్టాటిక్ నష్టాన్ని మోటార్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ భాషలో ‘కాన్సిక్వెంటల్’ నష్టంగా పేర్కొంటారు. మామూలుగా తీసుకునే రెగ్యులర్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ తరహా నష్టం కవరవ్వదు. ఒక నిర్దిష్ట చర్య వల్ల సంభవించిన నష్టం కావడమే దీనికి కారణం. అనుకోని సంఘటన వల్ల ఈ నష్టం జరగదు. ఇలాంటి సందర్భాల్లో చిన్నకార్ల ఇంజిన్ రిపేర్‌కు రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది. మధ్య తరహా కార్ల విషయంలో ఈ మరమ్మతు వ్యయం రూ. 3 లక్షల వరకూ ఉంటే, ఎస్‌యూవీ, ప్రీమియం వాహనాల విషయంలో రూ. 10 లక్షలు దాటిపోతుంది.
వ్యయ నివారణా మార్గం..
ఇక్కడే ‘ముందు జాగ్రత్త’ అన్న పదాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు, ఈ మొత్తానికి అదనంగా 10 శాతం చెల్లిస్తే కాన్సిక్వెంటల్ నష్టానికి కొండంత అండనిస్తుంది. వాహనదారులూ తస్మాత్ ‘ముందు’జాగ్రత్త మరి!!