రిటైల్ డిమాండ్‌కు నోట్ల రద్దు సెగ!
• నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.63 శాతం
• దాదాపు రెండేళ్ల కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ గణాంకాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం కనిపించింది. దాదాపు రెండేళ్ల కనిష్ట స్థాయిలో ఈ సూచీ 3.63 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 నవంబర్‌తో పోల్చితే రిటైల్ సరుకుల బాస్కెట్ ధర కేవలం 3.63 శాతం ఎగసిందన్నమాట. ఇంత తక్కువగా ధరల స్పీడ్ నమోదుకావడం 2014 నవంబర్ తరువాత ఇదే తొలిసారి. ఈ ఏడాది అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.20 శాతంకాగా, గత ఏడాది నవంబర్‌లో ఈ రేటు 5.41 శాతంగా ఉంది. వివిధ విభాగాలను చూస్తే...
⇔ ఫుడ్ అండ్ బేవరేజెస్: మ్తొతంగా ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 2.56 శాతం పెరిగితే, ఒక్క వినియోగ ఆహార ధరల సూచీ 2.11 శాతం పెరిగింది. వేర్వేరుగా పరిశీలిస్తే– కూరగాయల ధరలు వార్షికంగా అసలు పెరక్కపోగా –10.29 శాతం క్షీణించాయి. పండ్ల ధరలు 4.60 శాతం ఎగశాయి. పప్పు ధాన్యాల ధరలు 0.23 శాతం పెరిగాయి. మాంసం, చేపల ధరలు 5.83 శాతం పెరిగాయి. గుడ్ల ధరలు 8.55 శాతం ఎగశాయి.
⇔ పాన్, పొగాకు, మత్తు ప్రేరిత ఉత్పత్తులు: ద్రవ్యోల్బణం రేటు 6.29 శాతం ఎగసింది.
⇔ దుస్తులు, పాదరక్షలు: 4.98 శాతం ఎగసింది.
⇔ ఇంధనం, లైట్ విభాగం: 2.80%గా ఉంది.
⇔ హౌసింగ్: ఇక్కడ రేటు 5.04 శాతం పెరిగింది.
⇔ ఇక ఇదే నెలల్లో వేర్వేరుగా చూస్తే... గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు నవంబర్‌లో 4.78 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 3.05 శాతంగా ఉంది.