
ఇక ఆన్‌లైన్‌లోనూ ఎస్‌బీఐ రుణ దరఖాస్తు
వినియోగదారులకు రుణ దరఖాస్తు ప్రక్రియను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరింత సరళతరం చేసింది.
ముంబై: వినియోగదారులకు రుణ దరఖాస్తు ప్రక్రియను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరింత సరళతరం చేసింది. ఇకపై కస్టమర్లు ఎస్‌బీఐ రుణానికి దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా కూడా దాఖలు చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు ఒక అప్లికేషన్‌ను బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్ సొల్యూషన్ ద్వారా కస్టమర్లు గృహ, కారు, విద్యా, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫైలింగ్‌కు సంబంధించి అప్పటికప్పుడే ఈ-అప్రూవల్‌ను కూడా కస్టమర్లు పొందవచ్చని ఒక ప్రకటనలో ఎస్‌బీఐ పేర్కొంది.
దరఖాస్తును పరిశీలించి, బ్యాంక్ అధికారులే కస్టమర్లను లోన్ విషయంపై సంప్రదింపులు జరుపుతారని, రుణ మంజూరు విధివిధానాలను పూర్తిచేస్తారని తెలిపింది. అవసరమైన అన్ని పత్రాలనూ ఆన్‌లైన్ ద్వారానే కస్టమర్లు అప్‌లోడ్ చేయవచ్చని పేర్కొంది. దీనివల్ల రుణ దరఖాస్తుకు సంబంధించి ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గనుందని బ్యాంక్ పేర్కొంది. మొబైల్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి త్వరలో ఇలాంటి అప్లికేషన్‌నే బ్యాంక్ ప్రారంభించనుంది.