ఓబీసీకి మొండిబకాయిల షాక్ | OBC Q3 net tanks 91% on reduction of security receipts | Sakshi

ఓబీసీకి మొండిబకాయిల షాక్

Jan 30 2015 2:12 AM | Updated on Sep 2 2017 8:29 PM

ఓబీసీకి మొండిబకాయిల షాక్

ఓబీసీకి మొండిబకాయిల షాక్

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కు మొండి బకాయిల షాక్ తగిలింది.

- క్యూ3లో  లాభం 91 శాతం క్షీణత
- రూ.19.56 కోట్లకు పరిమితం
- 5.53%కి పెరిగిన స్థూల ఎన్‌పీఏలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కు మొండి బకాయిల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో నికర లాభం ఏకంగా 91.2 శాతం దిగజారి రూ.19.56 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం రూ.224 కోట్లుగా నమోదైంది. కాగా, డిసెంబర్ చివరినాటికి ఓబీసీ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) 5.43 శాతానికి పెరిగిపోయాయి.

2013 డిసెంబర్ చివరికి స్థూల ఎన్‌పీఏలు 3.87 శాతం మాత్రమే ఉన్నాయి. ఇక నికర ఎన్‌పీఏలు కూడా2.91 శాతం నుంచి 3.68 శాతానికి ఎగబాకాయి. బ్యాంక్ మొత్తం ఆదాయం 7.8 శాతం వృద్ధితో రూ. 5,064 కోట్ల నుంచి రూ.5,459 కోట్లకు పెరిగింది. నిర్వహణ వ్యయాలు రూ.712 కోట్ల నుంచి రూ.794 కోట్లకు చేరాయి.
 
మొండిబకాయిలకు అధిక ప్రొవిజనింగ్ కేటాయింపులతోపాటు సాంకేతికపరమైన కొన్ని కారణాలు కూడా క్యూ3లో లాభాలు భారీగా పడిపోయేందుకు కారణమైందని ఓబీసీ ఎండీ, సీఈఓ, అనిమేష్ చౌహాన్ పేర్కొన్నారు. జూన్‌లో కొన్ని మొండి బకాయిలను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని లాభంగా చూపించామని... అయితే, ఆర్‌బీఐతో సంప్రతింపుల అనంతరం దీన్ని పొరపాటుగా గుర్తించి, రూ.137 కోట్లను లాభాల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు.

మరోపక్క, డిసెంబర్ క్వార్టర్‌లో రూ.1,340 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారగా.. రూ.2,050 కోట్ల రుణాలను పునర్‌వ్యవస్థీకరించినట్లు చౌహాన్ వివరించారు. ఇక క్యూ3లో మొండిబకాయిల కోసం రూ.885 కోట్లను బ్యాంక్ ప్రొవిజనింగ్‌గా కేటాయించింది. క్రితం క్యూ3లో ఈ మొత్తం రూ.561 కోట్లుగా ఉంది. కాగా, ఇటీవలే(2014 డిసెంబర్ 31న) బ్యాంక్ కొత్త సీఈఓ, ఎండీగా చౌహాన్ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆఖరి త్రైమాసికం(క్యూ4) కూడా మందకొడిగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.
 
భారీగా పడిన షేరు: ప్రతికూల ఫలితాల కారణంగా ఓబీసీ షేరు ధర కుప్పకూలింది. గురువారం బీఎస్‌ఈలో ఒకానొక దశలో 11 శాతం పైగా క్షీణించి రూ.279 కనిష్టాన్ని తాకింది. చివరకు 10.81 శాతం నష్టంతో రూ.281 వద్ద ముగిసింది. గురువారం ఒక్కరోజులోనే బ్యాంక్ మార్కెట్ విలువ రూ.1,182 కోట్లు ఆవిరై.. రూ.8,203 కోట్లకు పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement