స్విస్‌ వాచీల హైటెక్‌ రూటు! | Old-school watchmakers push smart features to counter Apple Watch | Sakshi
Sakshi News home page

స్విస్‌ వాచీల హైటెక్‌ రూటు!

Published Wed, Nov 21 2018 12:11 AM | Last Updated on Wed, Nov 21 2018 9:51 AM

Old-school watchmakers push smart features to counter Apple Watch - Sakshi

లగ్జరీకి, ఖచ్చితత్వానికి స్విట్జర్లాండ్‌ (స్విస్‌)వాచీలు పెట్టింది పేరు. శతాబ్దాలుగా అనేక సవాళ్లను అధిగమిస్తూ దిగ్గజాలుగా ఎదిగిన స్విస్‌ వాచీ సంస్థలకు ప్రస్తుతం టెక్‌ దిగ్గజం యాపిల్‌ స్మార్ట్‌వాచీల రూపంలో మరో సవాలు ఎదురైంది. ప్రారంభంలో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా.. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌వాచీల తయారీపై స్విస్‌ దిగ్గజాలు కూడా దృష్టి పెడుతున్నాయి. వినూత్న స్మార్ట్, హైబ్రీడ్‌ వాచీలను రూపొందిస్తున్నాయి.

సాంప్రదాయ వాచీలకు హైటెక్‌ హంగులు అద్దుతున్నాయి. ఇందుకోసం ట్యాగ్‌ హోయర్, స్వాచ్, ఫాజిల్‌ వంటి దిగ్గజాలు యాపిల్‌ పోటీ సంస్థలైన గూగుల్, ఇంటెల్‌ కార్పొరేషన్‌తో జత కడుతున్నాయి. ఓవైపు సాంప్రదాయ డిజైన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు టెక్నాలజీ ఫీచర్స్‌ను కూడా పొందుపరుస్తూ సొంత స్మార్ట్‌ వాచీలు, హైబ్రీడ్‌ వెర్షన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి.

న్యూఢిల్లీ: 2015లో యాపిల్‌ వాచీని తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు అంతర్జాతీయంగా స్విస్‌ వాచీల అమ్మకాలు తగ్గాయి. మళ్లీ కొన్నాళ్లుగా కాస్త పుంజుకున్నప్పటికీ యాపిల్‌ గట్టి పోటీనే ఇస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ యూబీఎస్‌ అంచనాల ప్రకారం వచ్చే ఏడాది యాపిల్‌ వాచీల అమ్మకాలు 40% పెరిగి 3.3 కోట్లకు చేరనున్నాయి. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలోనే యాపిల్‌ 88 లక్షల వాచీలను విక్రయించనుందని అంచనా.

గణాంకాల ప్రకారం 2016లో మెకానికల్‌ వాచీల విక్రయాలను స్మార్ట్‌వాచీలు అధిగమించాయి. 2015లో అసలు ఊసే లేని హైబ్రీడ్‌ వాచీల అమ్మకాలు 2017లో 75 లక్షలుగా నమోదైనట్లు మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ యూరోమానిటర్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక పేర్కొంది. 2020 నాటికల్లా ఈ రెండు రకాల వాచీల అమ్మకాల పరిమాణం రెట్టింపవుతుందని సంస్థ అంచనా వేసింది. యాపిల్‌ సిరీస్‌ 4 వాచీల ధర 399 డాలర్ల నుంచి ఉంటున్న నేపథ్యంలో పెద్ద సంస్థలతో పోలిస్తే ఆ శ్రేణికి దరిదాపుల్లో తమ వాచీలను విక్రయించే చిన్న స్విస్‌ సంస్థలే ఎక్కువగా పోటీని ఎదుర్కొనాల్సి వస్తోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

హైబ్రిడ్‌కి ప్రాధాన్యం..
కొన్ని సంస్థలు స్మార్ట్‌ వాచీల వైపు మళ్లుతుండగా.. చాలా మటుకు కంపెనీలు హైబ్రిడ్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. వీటిలో టచ్‌ స్క్రీన్‌లు ఉండవు. ఇవి యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్స్‌కి అనుసంధానమవుతాయి. కాల్స్, మెసేజీల్లాంటివేమైనా వస్తే వైబ్రేషన్, లైట్లు ఆరి వెలగడం వంటి ఫీచర్స్‌తో అలర్ట్‌ చేస్తాయి.

బ్లూటూత్‌ కనెక్షన్‌తో వాచీలోని పుష్‌ బటన్స్‌ని ఉపయోగించి.. ఫోన్‌ కెమెరా, మ్యూజిక్‌ ఫంక్షన్స్‌ మొదలైనవాటిని ఆపరేట్‌ చేయొచ్చు. ట్యాగ్‌ హోయర్‌లో అత్యంత చౌకైన వాచీ ధర కూడా 1,200 డాలర్ల పైమాటే. లగ్జరీ స్విస్‌ వాచీ తయారీ సంస్థలపై యాపిల్‌ ప్రభావం మరీ అంతగా లేకున్నా.. అవి ముందుగా హైబ్రిడ్‌ వాచీలతో మొదలుపెట్టి. ఆ తర్వాత పూర్తి స్థాయి స్మార్ట్‌ వాచీల వైపు మళ్లాలని భావిస్తున్నాయి.  

వినూత్న ఫీచర్స్‌కు పెద్ద పీట..
స్మార్ట్‌వాచీలను సాధ్యమైనంత వినూత్నంగా తయారు చేసేందుకు స్విస్‌ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ట్యాగ్‌ హోయర్‌ ఇటీవలే కనెక్టెడ్‌ మాడ్యులర్‌ 41 పేరిట తమ స్మార్ట్‌వాచీలకు అప్‌గ్రేడ్‌ అందించింది. ఈ వాచీల్లో ఫిట్‌నెస్‌ ట్రాకింగ్, జీపీఎస్, కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. అటు మరో సంస్థ హుబ్లో .. ఇతర సంస్థల భాగస్వామ్యంతో లిమిటెడ్‌ ఎడిషన్‌ వాచీలను ప్రవేశపెడుతోంది. 2018 సాకర్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా బిగ్‌ బ్యాంగ్‌ రిఫరీ పేరిట ఇలాంటి వాటిని అందుబాటులోకి తెచ్చింది.

ఎప్పటికప్పుడు గేమ్‌ అలర్ట్‌లు అందించడం తదితర ఫీచర్స్‌తో రూపొందించిన ఈ వాచీలను పరిమిత స్థాయిలో 2,018 మాత్రమే విక్రయించింది. స్వాచ్‌ గ్రూప్‌ తమ లేటెస్ట్‌ వాచీ.. స్వాచ్‌ బెలామీ 2లో కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ను పొందుపర్చింది. అంతేగాకుండా వాచీల కోసం స్వాచ్‌ ఓఎస్‌ పేరిట సొంత ఆపరేటింగ్‌ సిస్టంపై కూడా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఓఎస్‌పై పనిచేసే వాచీలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా హైబ్రిడ్‌ వాచీల మార్కెట్లో అమెరికాకు చెందిన ఫాజిల్‌ గ్రూప్‌ అగ్రగామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి మూడు హైబ్రిడ్‌ వాచీల్లో ఒకటి ఫాజిల్‌ గ్రూప్‌దే ఉంటోంది. ఎంపోరియో, అర్మానీ, డీజిల్‌ వంటి దిగ్గజ బ్రాండ్స్‌తో కలిసి ఈ గ్రూప్‌ ఈ ఏడాది సుమారు 25 కొత్త వాచీలను ప్రవేశపెట్టింది. వీటిల్లో గుండె కొట్టుకుంటున్న వేగాన్ని తెలిపే ఫీచర్‌తో పాటు గూగుల్‌ పే టెక్నాలజీ మొదలైనవన్నీ ఉన్నాయి. ఫాజిల్‌ గ్రూప్‌ విక్రయించే హైబ్రిడ్‌ వాచీల్లో అత్యంత చౌకైన మోడల్స్‌లో క్యూ మోడర్న్‌ పర్సూట్‌ కూడా ఒకటి. దీని ధర 155 డాలర్లు (సుమారు రూ. 10,850).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement