ఓఎన్‌జీసీ లాభం 20% డౌన్
క్యూ4లో రూ. 3,935 కోట్లు...
* అధిక నిర్వహణ వ్యయాలు, రైటాఫ్‌ల ప్రభావం
* షేరుకి 50 పైసలు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు-గ్యాస్ దిగ్గజం ఓఎన్‌జీసీ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ నికర లాభం 19.5 శాతం క్షీణించి రూ.3,935 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,889 కోట్లుగా ఉంది.
ప్రధానంగా అధిక నిర్వహణ వ్యయాలు, నిరర్ధకమైన బావుల డ్రిల్లింగ్‌పై పెట్టుబడులను రైటాఫ్ చేయడం వంటివి లాభాల తగ్గుదలకు దారితీశాయి. ఇక మొత్తం ఆదాయం క్యూ4లో రూ.21,863 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరం క్యూ4లో రూ.21,403 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఒక్కో బ్యారెల్ చమురు ఉత్పత్తిపై 55.63 డాలర్ల రాబడిని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ రాబడి 44.87 డాలర్లు. ఇక నిర్వహణ వ్యయం రూ.1,278 కోట్లకు ఎగబాకింది. కొత్తగా తవ్విన కొన్ని బావుల్లో ఎలాంటి నిల్వలను కనుగొనలేకపోవడం(డ్రై వెల్స్)తో రూ.291 కోట్ల అన్వేషణ వ్యయాలను రైటాఫ్ చేసినట్లు ఫలితాల ప్రకటన సందర్భంగా ఓఎన్‌జీసీ చైర్మన్, ఎండీ దినేష్ కె.షరాఫ్ పేర్కొన్నారు. 2014-15 పూర్తి ఏడాదికి చూస్తే కంపెనీ రైటాఫ్ చేసిన మొత్తం రూ.10,000 కోట్లుగా ఉంది.
ఇందులో డ్రై వెల్స్ కారణంగా జరిగింది రూ.2,700 కోట్లు కావడం గమనార్హం. క్యూ4లో కంపెనీ ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 6.47 మిలియన్ టన్నుల నుంచి 6.45 టన్నులకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి కూడా 5.83 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 5.81 ఘనపు మీటర్లకు తగ్గింది.
క్యూ4లో తమపై ఎలాంటి సబ్సిడీ భారం పడలేదని, అయితే, పూర్తి సంవత్సరానికి సబ్సిడీ చెల్లింపు రూ.36,300 కోట్లుగా ఉన్నట్లు షరాఫ్ పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీ లాభాలపై రూ.20,437 కోట్ల మేర ప్రభావం చూపినట్లు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కూడా తమపై సబ్సిడీ చెల్లింపుల భారం లేదని ఆయన తెలిపారు. వంటగ్యాస్, కిరోసిన్‌లను ప్రభుత్వ నియంత్రిత రేట్లకు విక్రయించడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు వస్తున్న ఆదాయ నష్టాల్లో సగానికిపైగా భారాన్ని ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్‌లు భరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సబ్సిడరీ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌ను మార్కెట్లో లిస్టింగ్ చేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని షరాఫ్ స్పష్టం చేశారు.
పూర్తి ఏడాదికి ఇలా...
గడిచిన 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ నికర లాభం 20 శాతం దిగజారి రూ.17,733 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.22,095 కోట్లు. మొత్తం ఆదాయం మాత్రం 1.3 శాతం క్షీణతతో రూ.84,201 కోట్ల నుంచి రూ.83,094 కోట్లకు తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 31 శాతం దిగజారింది. రూ.26,507 కోట్ల నుంచి రూ.18,334 కోట్లకు పడిపోయింది. టర్నోవర్ కూడా రూ.1,78,205 కోట్ల నుంచి రూ.1,66,067 కోట్లకు తగ్గింది. 6.8 శాతం క్షీణించింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ 50 పైసలు చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
ఓఎన్‌జీసీ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 1 శాతం క్షీణించి రూ.328 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.