మాన్‌స్టర్.కామ్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ హైరింగ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 11 శాతం వృద్ధి నమోదైందని జాబ్ పోర్టల్ మాన్‌స్టర్.కామ్ వెల్లడించింది. ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ 15 పాయింట్లు(11 శాతం) పెరిగింది. జనవరి నుంచి నియామకాల్లో హెచ్చుదల కనపడుతోందని వివరించింది. రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనడానికి ఏప్రిల్ నియామకాల సూచి(ఇండెక్స్) నిదర్శనమని మాన్‌స్టర్ ఇండియా ఎండీ సంజయ్ మోడి పేర్కొన్నారు. ఐటీ, ట్రావెల్/టూరిజం రంగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, సిమెంటు, నిర్మాణ రంగం, ఐరన్/స్టీలు రంగాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సీనియర్ మేనేజ్‌మెంట్ పోస్టులకు డిమాండ్ 51 శాతం వృద్ధి కనబరిచింది.
హైదరాబాద్‌లో 11 శాతం..
ఐటీ, ఐటీఈఎస్, టెలికం రంగంలో హైదరాబాదీయులకు ఎక్కువ అవకాశాలు వరిస్తున్నాయి. ఆన్‌లైన్ మార్కెటింగ్ పోర్టల్స్ నుంచి భాగ్యనగరంలో నియామకాలు పెరిగాయని హెచ్‌ఆర్ రంగ సంస్థ టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆన్‌లైన్ నియామకాల్లో 50-60 శాతం ఈ పోర్టల్స్ నుంచే ఉంటాయని చెప్పారు. తయారీ, మౌలిక రంగంలో నియామకాల ఊసే లేదని చెప్పారు. కాగా, మాన్‌స్టర్ నియామక సూచి ప్రకారం గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 13 నగరాలకుగాను 10 నగరాలు వృద్ధి కనబరిచాయి. అహ్మదాబాద్ అత్యధికంగా 26 శాతం, బెంగళూరు 22, పునే 15, ముంబై 14, హైదరాబాద్‌లో 11% హెచ్చుదల నమోదైంది.
ఆన్‌లైన్ హైరింగ్‌లో 11 శాతం వృద్ధి
Published Fri, May 9 2014 12:52 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
Advertisement