ఒక కంపెనీ.. 22 బ్రాండ్లు! | only stainless steel water bottles plant placer in the country | Sakshi
Sakshi News home page

ఒక కంపెనీ.. 22 బ్రాండ్లు!

Published Sat, Mar 24 2018 1:30 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

only stainless steel water bottles plant placer in the country - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో స్టార్టప్స్‌ హవా మొదలయ్యాక.. వయసు, అనుభవంతో సంబంధం లేకుండా సక్సెస్‌ సాధించిన వారు చాలామందే ఉన్నారు. ప్లసెరో ఇంటర్నేషనల్‌ కూడా ఈ కోవలోదే. పట్టుమని పాతికేళ్లు లేని ఢిల్లీ కుర్రాడు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించేసి.. విజయవంతంగా నడిపిస్తున్నాడు. దేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా తదితర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 22 బ్రాండ్లు.. నెలకు 3 లక్షల బాటిళ్లు.. రూ.2.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి కంపెనీని తీసుకెళ్లాడు. మరిన్ని వివరాలు ప్లసెరో ఇంటర్నేషనల్‌ సీఈఓ వేదాంత్‌ పాడియా ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

‘‘ఢిల్లీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక మార్కెటింగ్‌లో పలు ఆన్‌లైన్‌ కోర్సులు చేశా. తర్యాత పాకెట్‌ యాడ్‌ పేరిట ప్రకటనల విభాగంలో సేవలందించే స్టార్టప్‌ను ప్రారంభించా. సరైన వ్యాపార విధానం లేకపోవటం, అంతర్గత సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల దీన్ని మూసేశా. రెండేళ్ల తర్వాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌కు ప్రత్యామ్నాయం చూపించాలని సంకల్పించి.. రూ.3 కోట్లతో 2015 మార్చిలో ప్లసెరో ఇంటర్నేషనల్‌ను ప్రారంభించా. దేశంలో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ తయారు చేసే ఏకైక సంస్థ ప్లసెరోనే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిల్టాన్, సెల్లో వంటి కంపెనీలు ఆయా ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాయి. మేకిన్‌ ఇండియా ఉత్పత్తే మా ప్రత్యేకత.

22 బ్రాండ్లు... ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు
ప్లసెరో నుంచి పెక్స్‌పో, డ్యూమా, క్వాన్‌టాస్, ఎన్‌ డ్యురా తదితర 22 బ్రాండ్ల వాటర్‌ బాటిల్స్‌ ఉన్నాయి. ఫ్రిడ్జ్, స్పోర్ట్స్, థర్మో మూడు విభాగాల్లో బాటిల్స్‌ ఉంటాయి. 500 ఎంఎల్, 750 ఎంఎల్‌ 1,000 ఎంఎల్‌ సైజుల్లోని బాటిల్స్‌ ధరలు రూ.325 నుంచి రూ.1,999 వరకూ ఉన్నాయి. దేశంలో 102 మంది డీలర్లున్నారు. ఆన్‌లైన్‌లో విక్రయాల కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే 6 నెలల్లో సొంత ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తాం. బిగ్‌బజార్, డీమార్ట్‌ వంటి హైపర్‌మార్కెట్లతో పాటూ టెలిషాపింగ్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.

నెలకు 3 లక్షల విక్రయాలు; 25 శాతం ఎగుమతులే
ఢిల్లీ–హర్యానా సరిహద్దులోని సోనిపట్‌లో 4 ఎకరాల్లో ప్లాంట్‌ ఉంది. నెలకు 7 లక్షల బాటిళ్ల తయారీ సామర్థ్యం. ప్రస్తుతం 60 శాతమే వాడుతున్నాం. దేశంతో పాటూ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయ్‌లోనూ నెలకు 3 లక్షల బాటిల్స్‌ విక్రయిస్తున్నాం. ప్రధాన బ్రాండ్‌ అయిన పెక్స్‌పో నెలకు ఆన్‌లైన్‌లో 10 వేలు, డీలర్‌షిప్స్‌ ద్వారా 85 వేలు విక్రయమవుతోంది. మొత్తం అమ్మకాల్లో ఎగుమతుల వాటా 25 శాతం వరకుంటుంది. మా విక్రయాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో  ఎక్కువ. మా మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం. గతేడాది ఈ రెండు రాష్ట్రాల్లో 62 వేల బాటిల్స్‌ విక్రయించాం. ప్రస్తుతం నెలకు 2.5 కోట్ల ఆదాయాన్ని సాధిస్తున్నాం. నికర లాభం 18% ఉంటుంది. గతేడాది రూ.30 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశాం. ప్రతి నెలా 35% వృద్ధిని నమోదు చేస్తున్నాం.

రూ.10 కోట్ల నిధుల సమీకరణ..
వచ్చే ఏడాది కాలంలో రూ.60 కోట్ల ఆదాయం, 50 లక్షల విక్రయాలకు చేరాలని లకి‡్ష్యంచాం. సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకూ విస్తరిస్తాం.  ఈ ఏడాది ముగిసేలోగా లంచ్‌ బాక్స్‌లు, కంటైనర్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నాం. ప్రస్తుతం సంస్థలో 225 మంది ఉద్యోగులున్నారు. తొలిసారిగా రూ.10 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. చర్చలు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో ముగిస్తాం’’.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement