సాధారణంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొందరు ఉద్యోగులు, సిబ్బంది లంచాలు తీసుకుంటూ పట్టుబడిన కథనాలు చూస్తూఉంటాం కదా. ఈ సమయంలో కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగులో ద్రావణం ఉండే సీసాలను కూడా ఉంచుతారు అధికారులు. అవేంటో వాటి కథ ఏంటో ఎపుడైనా ఆలోచించారా? అయితే అసలు ఆ సీసాలు ఏమిటి? అందులో పింక్ రంగులో ద్రావణం ఎందుకు ఉంటుంది ? దానికి లంచానికి సంబంధం ఏమిటి ? ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల కోసంపనిచేయాల్సిన కొందరు అక్రమార్కులు లంచం ఇస్తేనే పని స్థాయికి దిగజారుతారు. లబ్దిదారులు, బాధితులకు అందాల్సినవి అందకుండా, చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తూ జలగల్లా పీడించుకు తింటారు. నిజానికి లంచం తీసుకోవడం, ఇవ్వడమూ రెండూ నేరమే. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా, వాళ్లకు ఎంతోకొంత ముట్టజెప్పి తమ పని కానిచ్చుకుంటారు.
కానీ కొంతమంది అలాకాదు. అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదిస్తారు. వారికి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు లాంచావతార ఉద్యోగుల ఆటకట్టించేందుకు అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరప్షన్ బ్యూరో) రంగంలోకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్షించడమే ఈ శాఖ పని. ఈ క్రమంలోనే ఫిర్యాదు, లేదా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు బాధితులకు ముందుగానే కొన్ని నోట్లిచ్చి వాటిని లంచం డిమాండ్ చేస్తున్న అధికారి లేదా ఉద్యోగికి ఇవ్వమంటారు.
అయితే దీనికంటే ముందే ఏసీబీ అధికారులు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాల్‌ఫ్తలీన్ అనే పౌడర్‌ను రాస్తారు. నిజానికి ఈ పౌడర్ కళ్లకు కనిపించదు,గుర్తించలేం.ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి సదరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు. అనంతరం ముందుగా వేసిన వల ప్రకారం వారి దగ్గర్నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు.
ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది.
లంచం తీసుకున్న అధికారి చేతులను సోడియం బైకార్బొనేట్ మిశ్రమంలో ముంచుతారు. అంతకుముందే లంచంగా తీసుకున్న నోట్లకు ఉండే ఫినాల్‌ఫ్తలీన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది. ఎపుడైతే ఈ ద్రావణంలో చేతులు ముంచుతారో, సోడియం బైకార్బొనేట్ మిశ్రమం కాస్తా పింక్ రంగులోకి మారుతుంది. దీంతో వారు లంచం తీసుకున్నారని ధృవీకరించుకుంటారు. పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమమే కీలక సాక్ష్యంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment