మంత్రుల జోక్యం ఎక్కువే! | P Chidambaram downplays Subbarao’s revelations, says “There are contrary passages,” | Sakshi
Sakshi News home page

మంత్రుల జోక్యం ఎక్కువే!

Published Sat, Jul 16 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

మంత్రుల జోక్యం ఎక్కువే!

మంత్రుల జోక్యం ఎక్కువే!

వడ్డీరేట్లు తగ్గించాలని ఒత్తిడి చేసేవారు
తగ్గించనందుకు డిప్యూటీ గవర్నర్లు బలయ్యారు  
వారి పదవీకాలం పొడిగించమన్నా... చేయలేదు
ప్రణబ్, చిదంబరం ఇద్దరూ ఇలాగే చేశారు  
దేశీ చర్యల వల్లే రూపాయి పడిందన్నా వినలేదు
రాజన్ ప్రతిష్ఠ వల్లే రూపాయి కోలుకుంది 
నాకు ఆర్థిక వ్యవస్థే ముఖ్యం; ‘చీర్‌లీడర్’కాదల్చుకోలేదు
‘హూ మూవ్డ్ మై ఇంట్రస్ట్ రేట్’ పుస్తకంలో డాక్టర్ దువ్వూరి సుబ్బారావు

ముంబై: వడ్డీ రేట్లకు, కరెన్సీకి... తద్వారా ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేది రిజర్వు బ్యాంకు. అలాంటి రిజర్వు బ్యాంకు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం మితిమీరితే..! దాన్ని స్వతంత్రంగా వ్యవహరించనివ్వకపోతే..!! తన విషయంలో అదే జరిగిందన్నారు ఆర్‌బీఐ మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు. తాను గవర్నర్‌గా ఉన్న సమయంలో వడ్డీరేట్లు తగ్గించాలంటూ నాటి ఆర్థిక మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం తనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు. తాను అలా చేయకపోవటం వల్ల ఏం కోల్పోవాల్సి వచ్చిందో కూడా వివరించారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన 2008లో ఆర్‌బీఐ గవర్నరుగా సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు. 2013 సెప్టెంబర్ 4వరకూ ఐదేళ్లు కొనసాగారు. ఇండియా సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడారంటూ ప్రశంసలూ పొందారు. తాజాగా ఆయన ‘‘హూ మూవ్డ్ మై ఇంట్రస్ట్ రేట్’ అనే శీర్షికతో ఒక పుస్తకం రాశారు. 352 పేజీల ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలివీ...

 డిప్యూటీలు బలైపోయారు!!
అధిక వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించేవారు. దీనివల్ల వృద్ధి ఆగిపోతుందన్నది వారి అభిప్రాయం. ఇది తరచూ బహిరంగంగానే చెప్పేవారు. వడ్డీ రేట్లు తగ్గించాలని నన్ను ఒత్తిడి చేసేవారు. ఈ ఒత్తిడి వివిధ రకాలుగా ఉండేది. డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఉషా థోరట్ పదవీకాలాన్ని పొడిగించాలని నాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి నేను సిఫారసు చేశాను. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నపుడు సుబీర్ గోకర్ణ్‌కూ ఇలాగే సిఫారసు చేశాను. కానీ రెండు సందర్భాల్లోనూ తిరస్కరణే ఎదురైంది. వడ్డీ రేట్లు తగ్గించనందుకు వారిచ్చిన బహుమానమని నాకు అర్థమైంది. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసమే ఆర్‌బీఐ నిర్ణయాలు తీసుకోవాలి. దీన్లో ఎందుకు రాజీ పడాలన్నది నా లాజిక్. ఒత్తిళ్లకు లొంగిపోయి ‘చీర్ లీడర్’ కాదలచుకోలేదు.

 సెంట్రల్ బ్యాంక్ మాటే శక్తివంతం...
సెంట్రల్ బ్యాంక్ మాటే ఎంతో శక్తివంతమనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. 2001 నవంబర్ 9న ట్విన్ టవర్స్‌పై తీవ్రవాదులు దాడి జరిపాక ద్రవ్య లభ్యతకు ఎలాంటి సమస్యా రాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ చేసిన ఒకే ఒక్క ప్రకటన అమెరికా, అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించింది. 2012 ఏప్రిల్‌లో యూరో పతనం తప్పదన్నపుడు... ‘ఏది ఏమైనా యూరో పతనాన్ని అడ్డుకుంటాం’ అని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ మారీ డ్రాఘీ చేసిన ప్రకటన ఎంతో సానుకూలత చూపింది. యూరో నాయకుల సదస్సులు, సమావేశాల కన్నా డ్రాఘీ హామీ వల్లే యూరో నిలబడింది. సంక్షోభ సమయాల్లోనే కాదు. ప్రతి సందర్భంలోనూ సెంట్రల్ బ్యాంక్‌ల పారదర్శకత, క్రియాశీలత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతుంటాయి.

 ముందస్తు గెడైన్స్ చాలా కీలకం...
ఆర్థిక అంశాలపై ముందస్తు అంచనాలివ్వటమనేది పరపతి విధానం ఆధునీకరణకు నేను తీసుకున్న చర్యల్లో కీలకం. ఇది ఒకరకంగా సవాలే. ఎందుకంటే ఈ గెడైన్స్‌పై ఆధారపడి మార్కెట్ అంచనాలన్నీ రూపుదిద్దుకుంటాయి. 6-8 పేజీల ఈ షార్ట్ పేరాగ్రాఫ్ డాక్యుమెంట్ కోసం ఎంతో నైపుణ్యం ప్రదర్శించాలి. ఏ చిన్న తేడా జరిగినా ఆర్‌బీఐ తన హామీలను నెరవేర్చదన్న ధోరణి నెలకొంటుంది. ఇది ఆందోళన కలిగిస్తుంది. నేనో విషయం చెబుతా. 2011 అక్టోబర్-డిసెంబర్ మధ్య వడ్డీ రేటు బాగా ఎక్కువనే అభిప్రాయాలుండేవి. అయినా తగ్గించలేదు. తదుపరి చర్యల్లో రేటు తగ్గించే వీలుందని సూచించాం. అయితే అధిక ద్రవ్యోల్బణం వల్ల 2012 జనవరి పాలసీ సమీక్షలో ఇది సాధ్యం కాలేదు. దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నా.... తొలి సంకేతాలకు అనుగుణంగా వ్యవహరించలేదన్న విమర్శలొచ్చాయి. గెడైన్స్ ఒక్కటే కాక... దానిపైనా గెడైన్స్‌ను మార్కెట్ కోరుకుంటోందని అర్థమైంది. పాలసీలో వాడే ప్రతి పదమూ కీలకమే.

 రాజన్ ‘పరపతి’ రూపాయికి రక్ష...
2013 మధ్య నాటికి రూపాయి భారీగా పడిపోయింది. అయితే ఆ తర్వాత రూపాయి స్థిరపడ్డానికి నా వారసుడిగా వచ్చిన రఘురామ్ రాజన్  ప్రతిష్టే దోహదపడింది. ఆయన నియామకం మార్కెట్లలో విశ్వాసాన్ని కూడా నింపింది. రూపాయి బలహీనతకు అమెరికా ఉద్దీపనల ఉపసంహరణలు కాకుండా దేశీయ అంశాలే కారణమని నేను నాటి ఆర్థికమంత్రి చిదంబరానికి పలు సందర్భాల్లో చెప్పా. బంగారం వంటి ఉత్పాదకత లేని దిగుమతులతో కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరుగుతోందని చెప్పా. కానీ రూపాయి పతనానికి దేశీయ అంశాలే కారణమన్న నా వాదనను చిదంబరం అంగీకరించలేదు. దేశీయ వ్యవస్థాగత అంశాలపై దృష్టి పెట్టడం కన్నా... అంతర్జాతీయ పరిణామాలకు రూపాయి బలహీనతలను ముడిపెడితే రాజకీయంగా సౌలభ్యంగా ఉంటుందని ఆయన భావించి ఉండొచ్చన్నది నా సందేహం. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల ద్వారా విదేశీ మారకద్రవ్య నిల్వల్ని పెంచటం వంటి చర్యల్లో రాజన్‌కు, నాకు పూర్తి ఏకాభిప్రాయం ఉంది.

 తగిన గణాంకాలు లేకపోతే..?
ఏ నిర్ణయమైనా అందుబాటులోని గణాంకాల ప్రాతిపదికనే తీసుకుంటారు. అవి సరిగా లేకుంటే తప్పుడు నిర్ణయాలు తప్పవు. ఒకసారి ప్రకటించిన గణాంకాలను తరచూ సవరించటమనేది మరో సమస్య. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్షకు కీలకమైన పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు ఇదే తీరులో ఉండడం కరెక్టు కాదు. ఇది ద్రవ్యోల్బణం కట్టడిలో ప్రతికూలత కలిగిస్తుంది.

ప్రతి పేజీలో మేథో మెరుపు
డాక్టర్ దువ్వూరి సుబ్బారావు ప్రజ్ఞాపాటవాలు, నిజాయితీలతో ఐదేళ్ల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌గా సేవలందించారు. ఆయన మేథో పరిపూర్ణత పుస్తకంలోని ప్రతి పేజీపై మెరుస్తోంది.  - పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి

2008లో ఆర్‌బీఐ గవర్నర్‌గా...
2008 సెప్టెంబర్లో ఆర్‌బీఐ 22వ గవర్నర్‌గా బాధ్యతల స్వీకారం

2009 మార్చి... రెపోరేటు 5 శాతంకన్నా దిగువకు
2011 సెప్టెంబర్... పదవీకాలం మరో రెండేళ్లు పెంపు
2012 ఏప్రిల్... వృద్ధి లక్ష్యంగా రేట్ల కోతకు శ్రీకారం
2013 సెప్టెంబర్... ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతల విరమణ

రెపో రేటు 13 సార్లు పెంపు. 10 సార్లు తగ్గింపు.. రికార్డు
రాజన్ పదవీ విరమణ సమయంలో ఈ పుస్తకం వచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement