న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) రిటైల్ అమ్మకాలు జూలైలో గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో గతనెల పీవీ విక్రయాలు 2,43,183 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో అమ్ముడైన 2,74,772 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 13,32,384 యూనిట్లు కాగా, 2018 ఏడాది ఇదేనెల్లో నమోదైన 14,03,382 యూనిట్లతో పోల్చితే 5 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహన విక్రయాలు 14 శాతం తగ్గిపోయాయి. గతనెల్లో 23,118 యూనిట్ల సేల్స్ నమోదుకాగా, గతేడాది జూలైలో 26,815 యూనిట్లు అమ్ముడైయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 55,850 యూనిట్లు కాగా, గతేడాది జూలైతో పోల్చితే 3 శాతం పెరిగి 54,250 యూనిట్లుగా నిలిచాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,54,535 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదేనెల్లో 17,59,219 యూనిట్ల విక్రయాలు జరగ్గా ఈసారి 6 శాతం క్షీణించాయి. ఈ సందర్భంగా ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ.. ‘అన్ని విభాగాల్లోనూ వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగానే ఉన్నందున డిమాండ్ తగ్గిపోయింది. పీవీ సగటు ఇన్వెంటరీ ప్రస్తుతం 25–30 రోజులుగా ఉంది. వాణిజ్య వాహన సగటు ఇన్వెంటరీ ఏకంగా 55–60 రోజులుగా కొనసాగుతోంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment