క్రెడిట్ కార్డుతో టాప్ అప్‌లకు పేటీఎం షాక్
2 శాతం చార్జీల వడ్డన
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం.. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేసేవారికి షాకిచ్చింది. 2 శాతం లావాదేవీ చార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ విధానాన్ని టెక్నాలజీపై పట్టున్న కొందరు యూజర్లు నగదు రొటేషన్ కోసం వాడుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక బ్లాగ్ పోస్ట్‌లో సంస్థ తెలిపింది. కొందరు యూజర్లు క్రెడిట్‌కార్డులతో మొబైల్ వాలెట్‌లో డబ్బులు వేసుకుని, తర్వాత ఆ నగదును బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకోవడాన్ని గమనించినట్లుగా తెలిపింది. క్రెడిట్ కార్డుతో టాప్ అప్ చేసిన ప్రతిసారీ తాము అటు కార్డ్ నెట్‌వర్క్ సంస్థకు, ఇటు బ్యాంకుకు భారీ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుండగా.. తమ ప్లాట్‌ఫాంపై ఎటువంటి లావాదేవీలు జరపకుండానే సదరు యూజర్లు లబ్ది పొందారని పేటీఎం పేర్కొంది.
తమ నెట్‌వర్క్‌లో ఉత్పత్తులు, సర్వీసుల విక్రయం ద్వారా వచ్చే స్వల్ప మార్జిన్లే తమకు ఆదాయమని, కొందరు యూజర్లు అనుసరిస్తున్న విధానాలతో నష్టపోవాల్సి వస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకే రెండు శాతం చార్జీలు విధిస్తున్నట్లు వివరించింది. క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేసిన 24 గంటల్లోగా నిర్దిష్ట మొత్తానికి డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తామని తెలిపింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా టాప్ అప్‌లపై ఎలాంటి చార్జీలు ఉండబోవని స్పష్టం చేసింది.
మొబిక్విక్ ఆహ్వానం..: మరోవైపు, తమ వాలెట్స్‌లో క్రెడిట్ కార్డులతో టాప్ అప్ చేస్తే ఎటువంటి చార్జీలు విధించబోమని మరో మొబైల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. డీమోనిటైజేషన్ అనంతరం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు తాము ఫీజుల విధానాన్ని ఉపసంహరించామని, అదే విధానాన్ని ఇకపైనా కొనసాగిస్తామని వివరించింది.