పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్స్ షురూ
న్యూఢిల్లీ : ఎన్నో నెలలు జాప్యం అనంతరం ఈ-వాలెట్ దిగ్గజం పేటీఎం, పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్లను ప్రారంభించేందుకు సిద్దమైంది. మే 23 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ కార్యకలాపాలు సాగించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తుది అనుమతులు లభించినట్టు పేటీఎం తెలిపింది. ''పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్(పీపీబీఎల్) కోసం ఆర్బీఐ నుంచి తుది లైసెన్సులు పొందాం. 2017 మే 23 నుంచి కార్యకాలాపాలు ప్రారంభిస్తాం'' అని పబ్లిక్ నోటీసులో పేర్కొంది. తమ వాలెట్ బిజినెస్ లను కూడా ఈ కంపెనీలోకే బదిలీ చేస్తామని, దీనికి ఇప్పటికే 21.8 కోట్ల మంది యూజర్లున్నారని పేటీఎం చెప్పింది.
పేటీఎం సొంతమైన వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేరు మీదనే ఈ లైసెన్సులను పీపీబీఎల్ పొందింది. పీపీబీఎల్ లో పేటీఎం వాలెట్ కలుపడం ఇష్టంలేని వినియోగదారులు మే 23 కంటే ముందు పేటీఎంకు ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేటీఎం వెల్లడించింది.దీంతో వాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాలను వినియోగదారుల అకౌంట్లోకి బదిలీ చేస్తామని చెప్పింది. మే 23 లోపలే వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని పేటీఎం సూచించింది. ఆరునెలల నుంచి వినియోగించని ఈ వాలెట్‌లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్‌లోకి మారుస్తారు. దీంతోపాటు పేటీఎం బ్యాంక్ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది.