
న్యూఢిల్లీ: భారత్ డిజిటల్ ఎకానమీ దిశగా పయనిస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. నగదు లావాదేవీలు వ్యయభరితమైన వ్యవహారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా, అటు సమాజంమీద ఇటు ఆర్థికవ్యవస్థపైనా నగదు లావాదేవీలు ప్రతికూల ప్రభావం చూపెడతాయని ఆయన అన్నారు. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆర్థికమంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
♦ డిజిటైజేషన్ నేపథ్యంలో– నల్లధనం నిరోధం, డిజిటలైజేషన్ ఆర్థిక లావాదేవీల వృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకుంటోంది.
♦ నగదు రహిత లావాదేవీల దిశగా దేశం ఒకేసారి మారిపోదు. అయితే నెమ్మదిగా ఇటువైపు అడుగులు పడుతున్న విషయం సుస్పష్టమవుతోంది. బ్యాంకుల్లో డిపాజిట్లు, తగిన రేటుకు బ్యాంకుల రుణ సామర్థ్యం మెరుగుదలకూ దోహదపడే అంశం ఇది.
♦ ఆర్థికవ్యవస్థకు బ్యాంకింగ్ జీవనాడి. రానున్న రోజుల్లో దీని ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. మంచి బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కూడా దోహదపడుతుంది.
పీఎన్‌బీ కొత్త ప్రొడక్టులు: ఈ సందర్భంగా పీఎన్‌బీ రెండు ప్రొడక్టులు– ‘రూపే కార్డ్, ఈ–రూపియా’లను ఆర్థికమంత్రి ఆవిష్కరించారు.