నాకు బిల్ గేట్స్ ఏం చెప్పారంటే...!
నాకు బిల్ గేట్స్ ఏం చెప్పారంటే...!
Published Sun, Dec 25 2016 5:51 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
మన దేశంలో వంద కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని, 109 కోట్ల మందికి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని, అందువల్ల ఇక్కడ డిజిటల్ ఎకానమీ అద్భుతంగా విజయవంతం అవుతుందని తనకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిజి ధన్ మేళాలో పాల్గొన్న ఆయన.. ఈ అంశంపై మాట్లాడారు. ఇంతకుముందు ఎవరైనా ఏదైనా స్థలం గానీ, ఇల్లు గానీ కొనాలంటే.. డబ్బులు ఎంత ఇస్తారు, చెక్కు ఎంతకి ఇస్తారని అడిగేవారని, అలాంటి అక్రమ కార్యకలాపాలు ఉండేవని అన్నారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల సమాచారం కోసం తాము చాలా దేశాలతో సంప్రదింపులు జరిపామని అన్నారు. క్యాష్‌లెస్ ఎకానమీ అంటే అసలు డబ్బు లేకపోవడం కాదని.. తక్కువ నగదు వాడటమని చెప్పారు. తమ రాజకీయ ప్రత్యర్థులు, మీడియా కూడా ఈ విషయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారన్నారు.
మొబైల్ ఫోన్లు గానీ, డెబిట్/క్రెడిట్ కార్డులు గానీ లేని వాళ్లు కూడా కేవలం వేలి ముద్ర ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపులు చేయొచ్చని జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. ఒకప్పుడు దేశంలో కేవలం ఒక్క శాతం జనాభాకు మాత్రమే మొబైల్ ఫోన్లు ఉండేవని.. 20 ఏళ్లలో ఇప్పుడు 90 శాతం మందికి మొబైల్ ఫోన్లు వచ్చాయని ఆయన వివరించారు. ప్రధాని చెప్పినట్లుగా దీనివల్ల మొదట్లో కొన్ని సమస్యలు ఉన్నా.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి డబ్బులు వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. నకిలీ నోట్ల నుంచి ఉగ్రవాదం వరకు అన్నీ ఎక్కువగా నగదు మీద ఆధారపడటం వల్లే పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడు చేపట్టిన సంస్కరణల వల్ల మెరుగైన దేశం, మెరుగైన.. స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో వస్తాయన్నారు.
దేశ ఖజానాకు మార్కెట్ వర్గాలతో సహా అన్ని వర్గాలూ తమ వంతు సాయం చేస్తున్నాయని ప్రధానమంత్రి తన ప్రసంగంలో చెబితే.. దాన్ని మీడియాలో ఒక వర్గం వక్రీకరించిందని జైట్లీ అన్నారు. సెక్యూరిటీ లావాదేవీలపై దీర్ఘకాలంలో క్యాపిటల్ గెయిన్ పన్నులు ఉంటాయని మోదీ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి ఉద్దేశం ప్రభుత్వానికి గానీ, ప్రధానమంత్రికి గానీ లేనే లేదని అన్నారు.
Advertisement
Advertisement