మూత దిశగా పీఎన్‌బీ ముంబై బ్రాంచ్
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)లో దాదాపు రూ.13,900 కోట్ల భారీ కుంభకోణం దెబ్బకు ముంబై బ్రాంచ్ మూతపడుతోంది. ఈ స్కాంకు ప్రధానమైన ముంబై బ్రాడీ హౌజ్ బ్రాంచులో దాదాపు అన్ని కార్యకలాపాలు మూసివేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణానికి ఈ బ్రాడీ హౌజ్ బ్రాంచు నెలువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్కాంతో పోగొట్టుకున్న పరువు, ప్రతిష్టను తిరిగి వెనక్కి తెచ్చుకునేందుకు నియంత్రణా అధికారాలను కఠినతరం చేస్తున్నట్టు తెలిసింది. జనవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పీఎన్‌బీ సగానికి పైగా తన మార్కెట్ విలువను కోల్పోయింది.
బ్రాడీ హౌజ్ బ్రాంచుకు ఉన్న పెద్ద పెద్ద క్లయింట్స్‌ను బ్యాంకు పక్కన ఉన్న ఇతర బ్రాంచులకు తరలిస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పీఎన్‌బీలో చోటు చేసుకున్న ఈ స్కాంతో గత కొన్నేళ్ల కాలంగా అసాధారణమైన అభివృద్ధిని సాధించిందని అంతర్గత విచారణ సైతం వెల్లడించింది. దీంతో బ్యాంక్ క్లయింట్ కస్టమర్లందరిన్నీ వేరే బ్రాంచులకు తరలించేస్తోంది. 50 కోట్లకు పైన వార్షిక లావాదేవీలు జరిపే పెద్ద అకౌంట్లను, కొంతమంది ఉద్యోగులను ట్రాన్సఫర్ చేసినట్టు పీఎన్‌బీకి చెందిన ఒక అధికారి చెప్పారు. మెరుగైన పర్యవేక్షణ కోసం వీటిని తరలించినట్టు పేర్కొన్నారు. కేవలం చిన్న రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉన్నాయని తెలిపారు.
సాధారణ పునర్వ్యస్థీకరణలో భాగంగానే అకౌంట్లను ట్రాన్సఫర్ చేసినట్టు పీఎన్‌బీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. పీఎన్‌బీ అంతర్గత సిస్టమ్స్‌ను బలోపేతం చేసేందుకు, కొన్ని క్లిష్టమైన విధులను కేంద్రీకరించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్టు పేర్కొన్నారు. పీఎన్‌బీ కస్టమర్ల రిటైల్ కార్యకలాపాలు అక్కడే కొనసాగుతాయని చెప్పారు. 24 మంది ఉద్యోగుల వరకు బ్రాడీ హౌజ్ కార్యకలాపాలను మూసివేస్తారని చెప్పారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే కార్యకలాపాలు మూసివేసే ఆలోచనలు ఏమీ లేవని అధికార ప్రతినిధి అంటున్నారు. కాగ, బ్రాడీ హౌజ్ బ్రాంచ్ ఉద్యోగులతో కలిసి, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సిలు ఈ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కాంకు పాల్పడిన ఉద్యోగులను దర్యాప్తు ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment