Mumbai branch
-
ఘనంగా ‘డీఎస్ రీసెర్చ్’ వార్షికోత్సవం
ముంబై: కేన్సర్ నిర్మూలనకు విశేష కృషిచేస్తున్న డీఎస్ రీసెర్చ్ సెంటర్ ముంబై శాఖ ఏడో వార్షికోత్సం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాంద్రాలోని డా.ఎర్నెస్ట్ బోర్జెస్ మెమొరియల్ హోమ్‌కు వెళ్లిన డీఎస్ రీసెర్చ్ బృందం అక్కడి కేన్సర్ పేషెంట్లతో సరదాగా గడిపింది. మిమిక్రీ కళాకారుడు సాగర్ పటేల్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీఎస్ రీసెర్చ్ కేంద్రంలో చికిత్స పొంది కేన్సర్ నుంచి బయటపడిన వారు అక్కడి పేషెంట్లలో స్ఫూర్తి నింపేలా ప్రసంగించారు. -
స్కాం దెబ్బకి ఆ బ్రాంచ్ మూతపడుతోంది
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో దాదాపు రూ.13,900 కోట్ల భారీ కుంభకోణం దెబ్బకు ముంబై బ్రాంచ్ మూతపడుతోంది. ఈ స్కాంకు ప్రధానమైన ముంబై బ్రాడీ హౌజ్ బ్రాంచులో దాదాపు అన్ని కార్యకలాపాలు మూసివేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణానికి ఈ బ్రాడీ హౌజ్ బ్రాంచు నెలువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్కాంతో పోగొట్టుకున్న పరువు, ప్రతిష్టను తిరిగి వెనక్కి తెచ్చుకునేందుకు నియంత్రణా అధికారాలను కఠినతరం చేస్తున్నట్టు తెలిసింది. జనవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పీఎన్బీ సగానికి పైగా తన మార్కెట్ విలువను కోల్పోయింది. బ్రాడీ హౌజ్ బ్రాంచుకు ఉన్న పెద్ద పెద్ద క్లయింట్స్‌ను బ్యాంకు పక్కన ఉన్న ఇతర బ్రాంచులకు తరలిస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పీఎన్బీలో చోటు చేసుకున్న ఈ స్కాంతో గత కొన్నేళ్ల కాలంగా అసాధారణమైన అభివృద్ధిని సాధించిందని అంతర్గత విచారణ సైతం వెల్లడించింది. దీంతో బ్యాంక్ క్లయింట్ కస్టమర్లందరిన్నీ వేరే బ్రాంచులకు తరలించేస్తోంది. 50 కోట్లకు పైన వార్షిక లావాదేవీలు జరిపే పెద్ద అకౌంట్లను, కొంతమంది ఉద్యోగులను ట్రాన్సఫర్ చేసినట్టు పీఎన్బీకి చెందిన ఒక అధికారి చెప్పారు. మెరుగైన పర్యవేక్షణ కోసం వీటిని తరలించినట్టు పేర్కొన్నారు. కేవలం చిన్న రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉన్నాయని తెలిపారు. సాధారణ పునర్వ్యస్థీకరణలో భాగంగానే అకౌంట్లను ట్రాన్సఫర్ చేసినట్టు పీఎన్బీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. పీఎన్బీ అంతర్గత సిస్టమ్స్‌ను బలోపేతం చేసేందుకు, కొన్ని క్లిష్టమైన విధులను కేంద్రీకరించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్టు పేర్కొన్నారు. పీఎన్బీ కస్టమర్ల రిటైల్ కార్యకలాపాలు అక్కడే కొనసాగుతాయని చెప్పారు. 24 మంది ఉద్యోగుల వరకు బ్రాడీ హౌజ్ కార్యకలాపాలను మూసివేస్తారని చెప్పారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే కార్యకలాపాలు మూసివేసే ఆలోచనలు ఏమీ లేవని అధికార ప్రతినిధి అంటున్నారు. కాగ, బ్రాడీ హౌజ్ బ్రాంచ్ ఉద్యోగులతో కలిసి, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సిలు ఈ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కాంకు పాల్పడిన ఉద్యోగులను దర్యాప్తు ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. -
పీఎన్బీలో మరో కుంభకోణం
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణాలు తవ్వే కొద్దీ బయటికి వస్తున్నాయి. నీరవ్ మోదీ కుంభకోణం అనంతరం మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ముంబై బ్రాంచ్‌లో మరో 9.1 కోట్ల రూపాయల మోసం జరిగినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు గుర్తించింది. ఈ విషయంపై ఫెడరల్ పోలీసు వద్ద పీఎన్బీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. నీరవ్ మోదీ పాల్పడిన మాదిరిగానే.. అధికారుల సహకారంతో చంద్రీ పేపర్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీ కూడా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు వెల్లడైంది. అయితే ఈ స్కాంపై ఇటు పీఎన్బీ అధికార ప్రతినిధి కానీ, అటు చంద్రీ పేపర్ కానీ వెంటనే స్పందించలేదు. ఈ స్కాంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగ, గత నెలలో వెలుగులోకి వచ్చిన నీరవ్ మోదీ కుంభకోణంలో పీఎన్బీ ముంబై బ్రాంచ్‌లో దాదాపు రూ.12,700 కోట్ల అవకతవకలు జరిగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ స్కాం బయటికి రాకముందే, ఈ భారీ మోసానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చౌక్సి, కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయారు. వీరిని ప్రస్తుతం భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మోదీ, చౌక్సిలకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్‌పోల్‌ను కూడా కోరుతోంది ఈడీ. -
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. బ్యాంకుకు చెందిన ముంబై బ్రాంచులో భారీగా మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం ముంబైలోని తమ ఒక బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ నగదును ముంబై బ్రాంచు నుంచి విదేశాలకు పంపినట్టు తెలిసింది. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని వినియోగదారుల బ్యాంకు అకౌంట్లకు నగదును పంపినట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఇప్పటికే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు విచారించడం ప్రారంభించాయని పీఎన్బీ తెలిపింది. పారదర్శకతమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకే బ్యాంకు కట్టుబడి ఉందని పీఎన్బీ చెప్పింది. ఈ వార్తల నేపథ్యంలో పీఎన్బీ బ్యాంకు షేరు భారీగా పడిపోయింది. దాదాపు 6 శాతం ఈ బ్యాంకు షేరు క్షీణించింది. -
బ్యాంకుల్లో రోబోలు.. త్వరలో ప్రారంభం
త్వరలో ముంబై శాఖలో ప్రారంభం ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఖాతాదారులకు రోబోలతో సేవలు అందించనుంది. ’ఇరా’ పేరిట రూపొందించిన ఈ హ్యూమనాయిడ్ సర్వీసులను త్వరలో ముంబై నగర శాఖలో ప్రారంభించనుంది. కొచ్చికి చెందిన అసిమోవ్ రోబోటిక్స్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ నిలువెత్తు రోబోను.. సోమవారం ఆవిష్కరించారు. దేశీ బ్యాంకింగ్ రంగంలో ఇదే తొలి హ్యూమనాయిడ్ అని హెచ్డీఎఫ్సీ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. ఈ రోబో ఎటువంటి సేవలు అందిస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ రోబో.. రిసెప్షనిస్టులాగా వ్యవహరించవచ్చని, నిర్దిష్ట సేవలకు మాత్రమే పరిమితం కావొచ్చని సమాచారం. సిటీ యూనియన్ బ్యాంక్ గతేడాదే ఈ తరహా రోబో ’లక్ష్మి’నిప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది 125 పైగా అంశాలను హ్యాండిల్ చేయగలదు. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల కార్యకలాపాలకు తోడ్పాటు అందించే టెక్నాలజీలను అభివృద్ధి చేసేలా స్టార్టప్ సంస్థలతో చేతులు కలపనున్నట్లు చుగ్వివరించారు. అటు స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చేందుకు ఉద్దేశించిన రెండో విడత సమిట్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రారంభించింది. తొలి విడత సమిట్‌లో 100 ఎంట్రీలు రాగా.. 35 స్టార్టప్ సంస్థలు కొత్త ఐడియాలను ప్రతిపాదించాయి. బ్యాంకుతో కలిసిపనిచేసేందుకు వీటిలో అయిదింటికి అవకాశం దక్కింది.