న్యూఢిల్లీ: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని పోస్టల్ శాఖ భావిస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలను ఒక ప్రత్యేక వ్యాపార విభాగంగా (సెపరేట్ బిజినెస్ యూనిట్) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు కేబినెట్ నోట్‌ను పంపామని సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. రెండు వారాల్లో ఈ నోట్‌ను కేబినెట్ ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు.
మొదటి దశలో ఎస్‌బీయూను, రెండో దశలో పూర్తి స్థాయి బీమా కంపెనీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)రెండో వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఇటీవల ఐపీపీబీ 1.26 లక్షల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసిందని, 10 రోజుల్లో మరో పదివేల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నదని వివరించారు.
బజాజ్ ఆటో లాభం 20% అప్
న్యూఢిల్లీ: అమ్మకాల్లో వృద్ధితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బజాజ్ ఆటో నికర లాభం 20 శాతం పెరిగి రూ. 1,221 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ నికర లాభం రూ. 1,014 కోట్లు. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 19% వృద్ధి చెంది రూ. 6,595 కోట్ల నుంచి రూ. 7,879 కోట్లకు చేరింది. వాహన విక్రయాలు 26 శాతం వృద్ధితో 10.01 లక్షల నుంచి 12.60 లక్షల యూనిట్లకు చేరాయి. దేశీయంగా మోటార్ సైకిల్స్ అమ్మకాలు 4,66,431 నుంచి 6,44,093 యూనిట్లకు పెరిగాయి. బుధవారం బజాజ్ ఆటో షేరు బీఎస్‌ఈలో 2.65 శాతం క్షీణించి రూ. 2,499 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment